‘పరిశీలన’లో పీఎన్‌బీ రేటింగ్‌లు

19 Feb, 2018 00:06 IST|Sakshi

బ్యాంకు నుంచి పలు అంశాలపై స్పష్టత కోరాం

అందిన తర్వాత తుది నిర్ణయం

రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ ప్రకటన  

ముంబై: భారీ స్కామ్‌తో వణికిపోతున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రేటింగ్‌లను పరిశీలనలో పెడుతున్నట్టు ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ప్రకటించింది. ముంబైలోని బ్రాడీహౌస్‌ శాఖలో రూ.11,400 కోట్ల ఎల్‌వోయూల కుంభకోణం వెలుగు చూసిన విషయం విదితమే. నీరవ్‌ మోదీ, ఆయన కంపెనీలు ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల సాయంతో మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారు. ఎస్‌బీఐ తర్వాత ప్రభుత్వ రంగంలో రెండో అతిపెద్ద బ్యాంకు అయిన పీఎన్‌బీకి సంబంధించి డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లకు క్రిసిల్‌ ఏఏఏ, ఏఏ రేటింగ్‌లు కేటాయించి ఉంది.

‘‘పీఎన్‌బీ డెట్‌ ఇనుస్ట్రెమెంట్లపై మా రేటింగ్‌లను ‘పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో రేటింగ్‌ పరిశీలన’లో ఉంచాం. బ్రాడీహౌస్‌ బ్రాంచ్‌లో మోసపూరిత, అనధికారిక లావాదేవీలను గుర్తించినట్టు ఫిబ్రవరి 14 నాటి ప్రకటనలో వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని క్రిసిల్‌ పేర్కొంది. ఈ స్కామ్‌ కారణంగా ఏర్పడే చెల్లింపుల బాధ్యత, పరిమాణం, రికవరీ అవకాశాలు, ప్రొవిజనింగ్‌ అంచనాలు, మూలధన రేషియోపై పడే ప్రభావం గురించి పీఎన్‌బీ నుంచి స్పష్టత కోరినట్టు క్రిసిల్‌ తెలిపింది. వీటిపై స్పష్టత వచ్చిన అనంతరం పరిశీలన జాబితా నుంచి పీఎన్‌బీ రేటింగ్‌లను తొలగించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
 
పెరిగిన ఉద్దేశపూర్వక ఎగవేతలు
పీఎన్‌బీలో జనవరితో ముగిసిన చివరి ఎనిమిది నెలల కాలంలో ఉద్దేశపూర్వక భారీ రుణ ఎగవేతల మొత్తం (రూ.25 లక్షలపైన రుణం తీసుకున్న కేసులు) 23 శాతం పెరిగిపోయింది. వీటికి సంబంధించిన బకాయిలు రూ.14,593 కోట్లు. గతేడాది జూన్‌ నుంచి బ్యాంకు ఈ డేటాను విడుదల చేస్తోంది. అప్పుడు ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.11,879 కోట్లుగా ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తే జనవరి నాటికి ఎనిమిది నెలల్లో 22.8 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

మొండి బకాయిల వసూళ్లపై తమ చర్యల్ని తీవ్రతరం చేసిన కాలంలోనే ఇవి పెరగడం గమనార్హం. అయితే మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి బ్యాంకు నికర ఎన్‌పీఏలు రూ.34,076 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.34,994 కోట్లు. అంటే స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. స్థూల ఎన్‌పీఏలు రూ.57,519 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,628 కోట్లతో పోలిస్తే కొంచెం పెరిగాయి.


గీతాంజలి గ్రూపు రికార్డుల పరిశీలన
పీఎన్‌బీ స్కామ్‌ విచారణలో భాగంగా సీబీఐ, మెహుల్‌ చోక్సి ప్రమోట్‌ చేసిన గీతాంజలి గ్రూపు కంపెనీల బ్యాలన్స్‌ షీట్లను పరిశీలిస్తోంది. పీఎన్‌బీ నుంచి తీసుకున్న రూ.11,384 కోట్ల ఎల్‌వోయూల ఆధారంగా వివిధ బ్యాంకు శాఖల నుంచి డ్రా చేసుకున్న మొత్తం ఎంతన్న దానిని తేల్చే పని ప్రారంభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగి గోకుల్‌నాథ్‌శెట్టి, మనోజ్‌ ఖారత్, నీరవ్‌మోదీ కంపెనీ ఉద్యోగి ఒకరిని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

వీరితోపాటు పీఎన్‌బీకి చెందిన ఇతర ఉద్యోగుల నుంచి సమాచారం రాబడుతోంది. మెహుల్‌ చోక్సీకి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీ ఇద్దరూ దగ్గరి బంధువులన్న విషయం తెలిసిందే. మరోవైపు వీరికి ఎల్‌వోయూల ఆధారంగా క్రెడిట్‌ ఇచ్చిన విదేశీ బ్యాంకు శాఖల ఉద్యోగులను కూడా సీబీఐ విచారించనుంది.

హాంగ్‌కాంగ్‌లోని అలహాబాద్‌ బ్యాం కు, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు ఉద్యోగులకు ఈ స్కామ్‌లో పాత్ర ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. నిబంధనల మేరకు ఎల్‌వోయూలు 90 రోజుల వరకే ఉండాలని, 365 రోజులు కాదని అవి వెల్లడించాయి. కనుక ఉద్యోగులకు తెలిసే ఇది జరిగి ఉంటుందని పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు