పీపీఎఫ్ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే.. ఎనిమిదేళ్లు ఉండాల్సిందే!

5 Feb, 2015 00:47 IST|Sakshi
పీపీఎఫ్ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే.. ఎనిమిదేళ్లు ఉండాల్సిందే!


న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలో పెట్టుబడి పెట్టేవారు ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తే కనీసం ఎనిమిదేళ్లు వేచి చూడాల్సిందే. పీపీఎఫ్ 0ఇన్వెస్ట్‌మెంట్ ఉపసంహరణకు కనీస కాలపరిమితి (లాకిన్ పిరియడ్) పెంచాలన్న ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ పరిశీలిస్తున్న విషయాన్ని సంబంధిత వర్గాలు బుధవారం తెలియజేశాయి. ప్రస్తుతం ఈ కాలపరిమితి ఆరేళ్లు.పీపీఎఫ్ పెట్టుబడి మెచ్యూరిటీ కాల పరిమితిని ప్రస్తుత 15 ఏళ్ల నుంచి మరింత పెంచే ప్రతిపాదన కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మౌలిక రంగం అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక నిధుల లభ్యత కోసం ఈ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్రం మౌలిక రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అధికార వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావించాయి. పీపీఎఫ్ వివరాలు ఇవీ: ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద మినహాయింపు ప్రయోజనం లభిస్తోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై వడ్డీరేటు 8.7 శాతంగా ఉంది. వార్షికంగా కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడులు పెట్టే వీలుంది.

వ్యక్తిగతంగా ఆరేళ్ల తరువాత ఇన్వెస్టర్ తన పీపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు వెనక్కు తీసుకోడానికి వీలుంది. నాలుగో ఏడాది తన అకౌంట్ కలిగిఉన్న  మొత్తం ఫండ్‌లో గరిష్టంగా 50 శాతాన్ని అత్యవసర వ్యయం లేదా ఉన్నత విద్యకోసం ఉపసంహరించుకునే వీలూ ఉంది. 15 ఏళ్ల తరువాత మొత్తం మెచ్యూరిటీ అవుతుంది.

>
మరిన్ని వార్తలు