సమూహ ఏరోస్పేస్‌కు ప్రైవేట్ ఈక్విటీ

14 Nov, 2014 04:34 IST|Sakshi
సమూహ ఏరోస్పేస్‌కు ప్రైవేట్ ఈక్విటీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష పరిశోధన, పరికరాల తయారీలో దేశ, విదేశీ అవకాశాలను అందుకోవడానికి సమూహ ఏరోస్పేస్ పార్క్ సిద్ధమవుతోంది. పార్కులో ప్లాంట్ల నిర్మాణానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఆరు కంపెనీలు కలసి ఆదిభట్ల వద్ద 200 ఎకరాల్లో సమూహను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పార్క్‌లో  25 కంపెనీలు  ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నాయి.

రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 26 నుంచి 49 శాతానికి చేర్చడం, మేక్ ఇన్ ఇండియా విధానం, పెండింగు ప్రాజెక్టులకు అనుమతుల వంటి ప్రభుత్వ నిర్ణయాలతో పరిశ్రమ ఉన్నత శిఖరాలకు చేరుతుందని సమూహ డెరైక్టర్, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ తెలిపారు. ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకు రానుండడం హైదరాబాద్ కంపెనీలకు బూస్ట్‌నిస్తుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆయనింకా ఏమన్నారంటే.. పెట్టుబడికి పీఈ కంపెనీలు..
 తయారీ కంపెనీలకు రక్షణ, అంతరిక్ష రంగంలో వెల్లువలా వ్యాపార అవకాశాలున్నాయి. ప్రైవేటు ఈక్విటీ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడికి ముందుకొస్తున్నాయి. జనవరిలోగా సమూహ పార్కులో కంపెనీలు ప్లాంట్ల ఏర్పాటు పనులను ప్రారంభించనున్నాయి. 2016కల్లా ఈ కంపెనీలకు రూ.350 కోట్ల దాకా పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా.

 ఈ అంశమై పీఈ కంపెనీలతో సమూహ చర్చలు జరుపుతోంది. తొలి దశలో రూ.25 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. ఆర్డర్లు పెరిగేకొద్దీ ఈ మొత్తం పెరుగుతుంది. రూ.100 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్‌లకు ఈ సెంటర్ వెన్నుదన్నుగా నిలుస్తుంది. అలాగే నిపుణులను తయారు చేసేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

 అంతర్జాతీయ స్థాయిలో..
 దేశంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలతో పోటీపడే కంపెనీలు 500 వరకు ఉంటాయి. వీటిలో 15 దాకా హైదరాబాద్‌లో ఉన్నాయి. ఎఫ్‌డీఐలతో విదేశీ పరిజ్ఞానం బదిలీ అయి ఇక్కడి కంపెనీల ప్రమాణాలు మెరుగవుతాయి. వేలాది ఉద్యోగాలను సృష్టించొచ్చు. పన్ను ప్రయోజనాలు ఉంటే ఇతర రాష్ట్రాలతో పోటీపడొచ్చు. ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీసం ఏడాదైనా ప్రాక్టికల్స్ అవసరం.   

 ఎస్‌ఈసీకి మరిన్ని ఆర్డర్లు..
 ఇండైజినైజేషన్ (దేశవాళీ) కార్యక్రమం ఎస్‌ఈసీకి  కలిసి వచ్చింది. ప్రతిష్టాత్మక స్కార్పీన్ సబ్‌మెరైన్స్ (జలాంతర్గాములు) తయారీ కాంట్రాక్టును గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మజ్‌గావ్‌ఢాక్ నుంచి ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్  కంపెనీ అనే దక్కించుకుంది. డీసీఎన్‌ఎస్‌కు 20 రకాల ప్రధాన విడిభాగాలు భారత్‌లో ఎస్‌ఈసీ మాత్రమే అందిస్తోంది.  2015కల్లా రూ.350 కోట్ల విలువైన డీసీఎన్‌ఎస్ నుంచి అందిన తొలి ఆర్డరును పూర్తి చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న రూ.50 వేల కోట్ల విలువైన ఆరు జలాంతర్గాముల ఆర్డరును తిరిగి మజ్‌గావ్‌ఢాక్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇదేగనక జరిగితే ఎస్‌ఈసీకి కలిసి వస్తుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా