ఒక ఏడాది.. 1.2 లక్షల కోట్ల రైటాఫ్‌!!

16 Jun, 2018 00:43 IST|Sakshi

2017–18లో ప్రభుత్వ రంగ బ్యాంకుల తీరిది

2013–14తో పోలిస్తే నాలుగు రెట్లు పెరుగుదల 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) గత ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 1.20 లక్షల కోట్ల మేర మొండిబాకీలను రైటాఫ్‌ చేశాయి. ఆయా బ్యాంకులన్నీ కలిపి ప్రకటించిన నష్టాలతో పోలిస్తే రద్దు చేసిన బాకీల విలువ ఏకంగా ఒకటిన్నర రెట్లు అధికం కావడం గమనార్హం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013–14లో రూ. 34,409 కోట్లుగా ఉన్న రైటాఫ్‌లు.. అయిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి.

2017–18 నాటికి రూ. 1.20 లక్షల కోట్లకు (ప్రొవిజనల్‌) చేరాయి. బ్యాంకింగ్‌ పరిభాషలో రైటాఫ్‌ చేయడమంటే.. మొండిపద్దుకు సంబంధించి బ్యాంకు తనకొచ్చిన ఆదాయం నుంచి 100 శాతం ప్రొవిజనింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, దీనివల్ల మొండిబాకీలను ఖాతాల నుంచి తొలగించినట్లయినప్పటికీ.. బ్యాంకు నిర్వహణ లాభాలు దెబ్బతింటాయి.

ఈ పరిణామాల కారణంగానే పీఎస్‌బీలు గత ఆర్థిక సంవత్సరంలో ఇటు భారీగా రైటాఫ్‌లతో పాటు అటు రికార్డు స్థాయిలో నష్టాలు కూడా ప్రకటించాయి. 2016–17 దాకా ఎంతో కొంత లాభాలు ప్రకటిస్తూ వచ్చిన పీఎస్‌బీలు 2017–18లో ఏకంగా రూ. 85,370 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2017–18లో ఎస్‌బీఐ రైటాఫ్‌ చేసిన మొండిబాకీలు రూ. 40,196 కోట్లు.

మరిన్ని వార్తలు