పరిశ్రమలకు రేల్వే షాక్...!

21 Jun, 2014 00:46 IST|Sakshi
పరిశ్రమలకు రేల్వే షాక్...!

చార్జీల పెంపుతో సిమెంటు, ఉక్కు రవాణా భారం

  • సిమెంటు రేట్లు 3% మేర పెరిగే అవకాశం
  • 2.5 శాతం వరకూ పెరగనున్న ఐరన్ ధరలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలన్న రైల్వేశాఖ నిర్ణయంతో సిమెంటు, స్టీలు తదితర ఉత్పత్తులు మరింత భారం కానున్నాయి. దాదాపు 40 శాతం సిమెంటు రవాణా రైల్వేల ద్వారానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రవాణా చార్జీల పెరుగుదలతో సిమెంటు రేట్లు 3 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

దీంతో బస్తా ధరపై భారం రూ. 10కి కాస్త అటూ, ఇటూగా ఉండొచ్చని వివరించాయి. ఇక ఇనుము, దుక్కిఇనుము వంటి వాటి రేట్లు కూడా పెరగనున్నాయి. వీటి ధరలు సుమారు 2.5 శాతం దాకా పెరగవచ్చని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ దక్షిణ ప్రాంత చైర్మన్ వి. రామస్వామి సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఉక్కు కంపెనీలపై కూడా అంతేశాతం భారం వుండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్ల పెరుగుదల భారాన్ని కంపెనీలు.. వినియోగదారులకు బదలాయిస్తాయా లేదా ప్రస్తుతానికి అవే భరిస్తాయా అన్నది చూడాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొన్నారు. ఏటా రూ. 8,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే లక్ష్యంతో రైల్వేస్ అటు రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం మేర, సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి.
 
 రియల్టీ రంగానికి దెబ్బ...
ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సిమెంటు, ఉక్కు తదితర ఉత్పత్తుల ధరలు రైల్వే రవాణా చార్జీల పెంపు వల్ల మరింత ఎగిసే అవకాశం ఉందని రియల్టీ దిగ్గజం పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉక్కు, సిమెంటు..రెండూ ప్రధాన ముడి సరుకులని ఆయన చెప్పారు. గడ్డుకాలం ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి రవాణా చార్జీల పెంపు గట్టి ఎదురుదెబ్బగా ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే అమ్ముడుకాని ప్రాజెక్టు యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో మేం ప్రాపర్టీ రేట్లను పెంచే పరిస్థితి కూడా లేదు’ అని జైన్ పేర్కొన్నారు.
 
 కాబట్టి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్  రంగానికి కాస్త ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు జైన్ తెలిపారు.ఇప్పటికే వృద్ధి మందగమనంలో ఉన్నందున ఉక్కు వంటి భారీ పరిశ్రమలపై రవాణా చార్జీల పెంపు భారాన్ని మోయగలిగే పరిస్థితి లేదని సీఐఐ పేర్కొంది.  సరకు రవాణా ద్వారా రైల్వేస్‌కి సుమారు 20 శాతం ఆదాయం ఉక్కు రంగం నుంచే ఉందని, ఇప్పటికే ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని బెనర్జీ పేర్కొన్నారు.
 
ఎరువుల సబ్సిడీ భారం మరో రూ.200 కోట్లు: సరకు రవాణా చార్జీల పెంపుదలతో ఎరువుల సబ్సిడీ భారం ఏటా దాదాపు రూ. 200 కోట్ల మేర పెరగనుంది. అయితే, ఈ ప్రభావం రిటైల్ రేట్లపై ఉండబోదని ఎరువుల సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. ప్రతి ఏటా దేశీయంగా 4.4 కోట్ల టన్నుల ఎరువులు రవాణా అవుతుండగా.. ఇందులో 80% రవాణా రైలు మార్గంలోనే ఉంటోంది.  మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రూ. 67,970 కోట్ల మొత్తాన్ని ఎరువుల సబ్సిడీగా నిర్ణయించింది.
 
 విశాఖ ఉక్కుపై ప్రభావం...
సాక్షి,విశాఖపట్నం: రైల్వేశాఖ రవాణా చార్జీలు పెంచడంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌పై మరింత భారం పడనుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి నిత్యం లక్షల టన్నుల్లో ముడి ఇనుమును వైజాగ్‌పోర్టు,గంగవరం పోర్టుల నుంచి ప్లాంటు వరకూ సరుకును తీసుకురావడానికి రవాణా చార్జీల రూపంలోనే ఏటా రైల్వేకు కోట్లకు కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు చార్జీలు మరింత పెరగడంతో ఆర్థికంగా మరింత సమస్య ఎదుర్కోనుంది. ఇప్పటికే ముడి ఇనుము విక్రయ ధరలను నేషనల్  మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ) భారీగా పెంచేసింది.
 
మార్కెట్లో ఉక్కు అమ్మకాలు మందగించి సతమతమవుతోన్న స్టీల్ రంగానికి ఒకపక్క ముడి ఇనుము ధర పెంచడం, మరోపక్క రవాణా చార్జీలు పెంచడంతో ఆర్థిక భారం భరించలేక త్వరలో ఉక్కు ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. రైల్వే నిర్ణయం వెలువడిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌తోపాటు అనేక ప్రైవేటు ఉక్కు కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్థికభారంపై చర్చించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోపక్క ఇక్కడి ఎన్‌టీపీసీ ప్లాంటుపైనా రవాణా చార్జీల పెంపు భారం  పడనుంది. తాల్చేరుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి ఎన్‌టీపీసీ 8 లక్షల బొగ్గు దిగుమతి చేసుకుంటోంది.
 
ద్రవ్యోల్బణం మరింత పైపైకి..

న్యూఢిల్లీ:  రైలు ప్రయాణ చార్జీలు, సరకు రవాణా చార్జీల పెంపుదల అనివార్యమే అయినప్పటికీ.. దీని వల్ల ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రవాణా వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని, అయితే దీని వల్ల రైల్వే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకానమిస్టు డీకే జోషి చెప్పారు.
 
ఇటీవలే విడుదలైన గణాంకాల ప్రకారం.. టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో ఏకంగా అయిదు నెలల గరిష్టమైన 6.01 శాతం మేర ఎగిసిన సంగతి తెలిసిందే. అటు, ప్రయాణికులపై కొంత భారం పడుతున్నప్పటికీ.. రైలు చార్జీల పెంపు స్వాగతించతగినదేనని ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ పార్ట్‌నర్ అభయ అగర్వాల్ తెలిపారు. తగినన్ని నిధులు ఉంటేనే రైల్వే శాఖ మెరుగైన సర్వీసులు అందించడం సాధ్యపడుతుందన్నారు.
 
సాహసోపేత నిర్ణయం..
చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం సాహసోపేతంగా వ్యవహరించిందని, సబ్సిడీలను కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న సంకేతాలను ఇది పంపించినట్లయిందని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సీఏసీపీ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ పేర్కొన్నారు. ఇది సర్వీసుల మెరుగుదలకు, ముందుముందు రేట్ల తగ్గుదలకు తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైల్వేస్‌ని ఒడ్డున పడేసేందుకు దిద్దుబాటు చర్యలు అవసరమని, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు.
 
సరకు రవాణా, రైలు చార్జీలను పెంచడమనేది రైల్వేస్ మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడగలవని భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. సురక్షితమైన సర్వీసులు అందించే దిశగా వనరులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడగలదని వివరించారు.
 
రైల్వేస్ ప్రాజెక్టుల్లో పాల్గొనేలా బహుళజాతి ఫండింగ్ ఏజెన్సీలను ఆహ్వానించడం, రైల్వే స్థలాలను మెరుగ్గా వినియోగించుకోవడం, రైల్ అసెట్ లీజింగ్ అథారిటీని ఏర్పాటు చేయడం తదితర చర్యల ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఏళ్ల తరబడి పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా రేట్లను పెంచి ఉంటే.. ఇంత భారీగా ఒకేసారి పెంచాల్సిన అవసరం ఉండేది కాదని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు