సిమెంట్‌కు ఇన్‌ఫ్రా దన్ను 

27 Sep, 2023 01:17 IST|Sakshi

10–12 శాతం డిమాండ్‌ అప్‌! 

క్రిసిల్‌ రేటింగ్స్‌ తాజా అంచనా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంట్‌కు డిమాండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేస్తోంది. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని వెల్లడించింది. క్రిసిల్‌ రేటింగ్స్‌ ప్రకారం.. రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, నగరాభివృద్ధి, టెలికం, పోర్టులు, విమానాశ్రయాలు, నీరు వంటి మౌలిక వసతులకు 2022–23తో పోలిస్తే రూ.1.6 లక్షల కోట్ల అదనపు బడ్జెట్‌ కేటాయింపులతో ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో పటిష్ట ప్రయాణాన్ని కొనసాగిస్తూ సిమెంట్‌ డిమాండ్‌ 2023–24లో 10–12 శాతం అధికమై 440 మిలియన్‌ టన్నులకు చేరే అవకాశం ఉంది. సిమెంట్‌ డిమాండ్‌ 2022–23లో 12 శాతం, 2021–22లో 8 శాతం ఎగసింది.  

నిర్వహణ లాభం జూమ్‌.. 
స్థిరంగా ఉన్న సిమెంట్‌ ధరలకుతోడు విద్యుత్, ఇంధన ఖర్చులు కాస్త తగ్గడంతో సిమెంట్‌ తయారీదారుల నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24లో టన్నుకు రూ.200 పుంజుకునే చాన్స్‌ ఉంది. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం సిమెంట్‌ డిమాండ్‌ను నడిపిస్తోంది. సిమెంట్‌ వార్షిక అమ్మకాల్లో మౌలిక సదుపాయాల వాటా 30 శాతం ఉంది.

ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో 38 శాతం పెరిగాయి. బడ్జెట్‌ మొత్తంలో చేసిన ఖర్చు 2023 జూలై వరకు 40 శాతంగా ఉంది. సిమెంట్‌ డిమాండ్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్న గృహ విభాగం స్థిర వృద్ధిని సాధిస్తుందని అంచనా. సరసమైన గృహాలకు ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతు డిమాండ్‌ను పెంచుతుంది.  

రెండంకెల వృద్ధికి.. 
2023 ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో సిమెంట్‌ డిమాండ్‌ 13–15 శాతంగా ఉంది. అధిక బేస్, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్రం చేయబోయే మూలధన వ్యయం కొంత మందగించవచ్చు. దీంతో ద్వితీయార్థంలో డిమాండ్‌ 7–9 శాతానికి మధ్యస్థంగా ఉండవచ్చు. అయితే ఆలస్యమైన, అసమాన రుతుపవనాల కారణంగా గ్రామీణ గృహాల డిమాండ్‌ కొంత  తగ్గే అవకాశం ఉంది.

ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే మూడవ త్రైమాసికంలో కార్మికుల పరిమిత లభ్యత కూడా పాత్ర పోషిస్తుంది. బలమైన ప్రథమార్ధం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా సిమెంట్‌ ధరలు 2023 ఏప్రిల్‌–ఆగస్ట్‌ మధ్య 2.5 శాతం పడిపోయాయి. సిమెంట్‌ ధరలు ఇటీవల స్వల్పంగా పెరగడంతో అధికం అవుతున్న డిమాండ్‌ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధికి సహాయపడుతుంది.

మరిన్ని వార్తలు