స్థిరాస్తి సంఘాలతో ఎవరికేం లాభం?

17 Dec, 2016 00:03 IST|Sakshi
స్థిరాస్తి సంఘాలతో ఎవరికేం లాభం?

ప్రవర్తనా నియమావళిని పాటించకపోతే బహిష్కరణ: సంఘాల వెల్లడి
కానీ, ఆచరణలో మాత్రం వాస్తవదూరం: కొనుగోలుదారులు
సంఘం పేరిట సొంత పనుల లాబీయింగ్‌


‘‘నిర్మాణ రంగంలోని సాధకబాధకాలను పరిష్కరించాలంటే బృందంగా పనిచేయాలి. అప్పుడే కొనుగోలుదారులకు సరైన న్యాయం చేయగలం. అలాగే సంఘం ప్రవర్తనా నియమావళిని పాటించకపోతే మాత్రం కఠినమైన నిర్ణయాలు తప్పవు’’    .. ఇది స్థిరాస్తి సంఘాల మాట.

‘‘సంఘం సభ్యుడంటే నిబంధనలు పాటిస్తాడని, నిర్మాణంలో నాణ్యతతో పాటూ గడువులోగా ఫ్లాట్‌ అప్పగించేస్తాడని నమ్మి ఫ్లాట్‌ కొన్నా. కానీ, మధ్యలోనే ప్రాజెక్ట్‌ను ఆపేసి.. కట్టిన డబ్బూ వెనక్కివ్వని పరిస్థితి’’    .. ఇది ఓ ప్రాజెక్ట్‌లోని కొనుగోలుదారుడి ఆవేదన.

‘‘ అధికారులు, కస్టమర్లతో ఎదురయ్యే సమస్యలను సంఘం తరుఫున పరిష్కరిస్తారని ఓ సంఘం సభ్యుడిగా చేరా. కానీ, అవేవీ జరక్కపోగా.. సంఘం పేరిట అధికారులను కలసి ఎవరికి వారు సొంత పనుల లాబీయింగ్‌ చేసుకుంటున్నారు’’    .. ఇది ఓ స్థిరాస్తి సంఘంలోని సభ్యుడి ఆరోపణ.

సాక్షి, హైదరాబాద్‌
ఇదీ క్లుప్తంగా భాగ్యనగరంలోని స్థిరాస్తి సంఘాల పరిస్థితి. పేరు మోసిన స్థిరాస్తి సంఘంలోని సభ్యుడినంటూ ఢంకా బజాయించుకోవటం నిర్మాణ సంస్థలకు పరిపాటే. అక్కడితో ఆగకుండా ప్రాజెక్ట్‌ బ్రోచర్‌ మీద ముద్రించుకొని ప్రచారం చేసుకోవటమూ తెలిసిందే. పోనీ, కస్టమర్లకిచ్చిన హామీలైనా నెరవేరుస్తాడా అంటే అదీ లేదు. మరోవైపు సంఘం ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించేవారూ బోలెడు మందే ఉన్నారు.

వాస్తవానికి సంఘాలేం చేయాలి..
ఆయా సంఘాలు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలను ఉటంకించాలి. రోజూ వారి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే ఈవెంట్లు, సమావేశాలను సభ్యులకు తెలియపరచాలి.
నిర్మాణ రంగంలోని సాదకబాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థిరాస్తి సంఘాలది. ప్రభుత్వం, నిర్మాణ సామగ్రి తయారీ కంపెనీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ధరలను అదుపులో ఉంచాలి.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే జీవో, చట్టాల గురించి సంఘం సభ్యులతో చర్చి స్తారు. అందులోని క్లిష్టమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సవరణలు చేయిస్తారు. సంఘం సభ్యులకు నిపుణుల సమక్షంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
నిర్మాణ రంగంలో వస్తున్న టెక్నాలజీని, మార్పులను ఎప్పటికప్పుడు ఆయా సంఘాల్లోని సభ్యులకు చేరవేర్చాలి. వాటిపై సభ్యులకు సమావేశాలు, అవసరమైతే విదేశీ నిపుణులతో శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించాలి.
కస్టమర్లకు ఇచ్చిన గడువులోగా ఫ్లాట్లను అందించేందుకు వేగవంతమైన నిర్మాణాలు ఎలా చేపట్టాలో శిక్షణ ఇవ్వాలి.  కస్టమర్ల అభిరుచులను స్వాగతిస్తూనే ఆధునిక వసతుల కల్పనలో ఎలా ముందుండాలో వివరించాలి.
ఇతర నగరాలు, విదేశాల్లో జరిగే నిర్మాణ రంగ సభలు, సమావేశాలకు సంఘం సభ్యులను తీసుకెళ్లి ప్రత్యక్ష శిక్షణ ఇప్పించాలి.
సంఘంలోని కొత్త, యువ బిల్డర్లు/డెవలపర్లకు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తాయి. అవసరమైతే వారికి సంఘంలో కీలక బాధ్యతలను అప్పగించి వారి నాయకత్వ ప్రతిభను పరీక్షించాలి.

కానీ, వాస్తవంగా జరుగుతుందేంటి?
సంఘంలో సభ్యుడిగా ఉంటూ నిబంధనలను అతిక్రమించే బిల్డర్లు/డెవలపర్లు నగరంలో కోకొల్లలు. అంతేకాదు వినియోగదారుల ఫోరంలో కేసులు నమోదైన సంఘం సభ్యులూ బోలెడు మందే ఉన్నారు. కొందరు బిల్డర్లయితే జైలు ఊచలు కూడా లెక్కపెట్టినవాళ్లూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయా నిర్మాణ సంస్థను గానీ బిల్డర్‌ను గానీ సంఘం తరుఫున ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా సంఘం నుంచి బహిష్కరిస్తామని పదే పదే ఢంకా బజాయించే సంఘం అధ్యక్షులు ఆచరణలో మాత్రం అమలు చేయట్లేదని కొనుగోలుదారుల ఆరోపణ. ఇంకా కస్టమర్లేమంటున్నారంటే.. ఒకట్రెండు సంస్థలను బహిష్కరించి ప్రచారం చేస్తేనే మిగిలిన సంస్థలు ఒప్పందాలను అతిక్రమించకుండా, కస్టమర్లకు విలువనిస్తూ సక్రమంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు.

అన్ని సంఘాల్లోనూ సభ్యత్వం..
ప్రస్తుతం హైదరాబాద్‌లో చిన్న, పెద్ద బిల్డర్లు అంతా కలిపి వెయ్యిలోపే ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క సంఘంలో సభ్యత్వం కావాలన్న నిబంధనేమీ లేదు. కానీ, వ్యక్తిగత అవసరాల కోసం కొందరు, కొత్త పరిచయాల కోసం ఇంకొందరు, పనుల లాబీయింగ్‌ కోసం ఇంకొందరు ఏదో ఒక సంఘంలో సభ్యత్వం తీసుకుంటున్నారు. అయితే నగరంలోని చాలా మంది బిల్డర్లు మోహమాటం కోసమో లేక ఇతర అవసరాల కోసమో అన్ని సంఘాల్లోనూ సభ్యత్వం తీసుకోకతప్పని పరిస్థితి. సభ్యత్వ రుసుము, రెన్యువల్‌ ఫీజుల పేరిట అన్ని సంఘాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.

ప్రస్తుతం నగరంలో క్రెడాయ్, ట్రెడా, నరెడ్కో, హెచ్‌ఆర్‌ఏ, బీఏఐ, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ వంటి సంఘాలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. అయితే వీటిలో కొన్ని సంఘాలు మాత్రం వ్యక్తిగతంగా కాకుండా కొన్ని సంఘాల సమూహంతో ఏర్పడినవి. ట్రెడా, గ్రేటర్‌ సిటీ, కూకట్‌పల్లి, వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ ఫెడరేషన్స్, హైదరాబాద్‌ రియల్టర్స్, రిజిస్ట్రేషన్‌ విభాగం నుంచి ఒక అసోసియేషన్‌ ఇవ న్నీ కలసి నరెడ్కో తెలంగాణగా ఏర్పడింది. అలాగే గ్రేటర్‌ సిటీ, ఉప్పల్, ఈస్ట్‌ జోన్, కూకట్‌పల్లి, వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్స్‌ ఇవి కలసి తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌గా ఏర్పడింది.

సంఘాలతో ప్రజలకేం లాభం..
స్థిరాస్తి సంఘాలతో ప్రజలకు ఇళ్లు కొనక ముందు, కొన్న తర్వాత రెండు వైపులా లాభాలుంటాయి. కొనకముందు.. స్థిరాస్తి సంఘాల్లోని సభ్యుడంటే ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ నాణ్యమైన నిర్మాణాల్ని చేపడతాడని నమ్మకంతో కస్టమర్లు ముందడుగేస్తారు. ఇళ్లు కొన్నాక.. నిర్మాణ పరమైన సమస్యలు తలెత్తితే సంఘం తరుఫున ప్రత్యక్షంగా పర్యవేక్షించి పరిష్కరిస్తాడు. అవసరమైతే ప్రత్యేకంగా ఓ ఫోరాన్ని ఏర్పాటు చేయాలి. ఫ్లాట్లను విక్రయించేటప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కొనుగోలుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

సొంత పనుల లాబీయింగ్‌
‘‘నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీపై సలహాలు, సూచనలు కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగరంలో పేరు మోసిన స్థిరాస్తి సంఘాలతో సమావేశం జరిపారు. మీటింగ్‌కు హాజరైన సంఘం ప్రతినిధుల్లో ఒకరు విధానంలోని నిర్ణయాలపై సాధకబాధకాలను విశ్లేషించాల్సింది పోయి.. తనకు గచ్చిబౌలిలో పదెకరాల భూమి ఉందని.. ప్రాజెక్ట్‌ అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ సంబంధిత అధికారులపై ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత పనులను సీఎం ముందు ప్రస్తావించారు. దానికి బదులుగా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ వెంటనే ఫోన్‌లో సంబంధిత అధికారులనూ మందలించారు.

చివరగా.. ఆయా నిర్మాణ సంఘం గచ్చిబౌలిలో ప్రాజెక్ట్‌ను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించింది కూడా’’ ఇదీ ఓ స్థిరాస్తి సంఘం ప్రతినిధి వ్యవహారమని ఓ బిల్డర్‌ ‘సాక్షి రియల్టీ’కి వివరించారు. ‘‘ప్రతి నెలా సంఘం తరుఫున సమావేశమంటూ ఓ పెద్ద హోటల్‌లో నిర్వహిస్తారు. అక్కడికి సభ్యులంతా వస్తారా అంటే అదీ లేదు. పేరుమోసిన నిర్మాణ సంస్థలు తమ తరుఫున సంస్థలోని ఎవరో ఒకరిని పంపిస్తారు. పోనీ సమావేశంలో ఉపయోగపడే విషయమేమైనా చెబుతారా అంటే అదీ లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే విందు వినోదానికే ఈ సమావేశమన్నట్లు ఉంటుందని’’ మరో బిల్డర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు