రిటైల్‌ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్టానికి.. 

13 Apr, 2018 00:58 IST|Sakshi

మార్చిలో 4.28 శాతం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం తాజాగా అయిదు నెలల కనిష్టానికి తగ్గి మార్చిలో 4.28 శాతానికి పరిమితమైంది. ఇది ఫిబ్రవరిలో 4.44 శాతం. గతేడాది మార్చిలో 3.89 శాతం ధరల పెరుగుదలతో పోలిస్తే మాత్రం ఈసారి అధికంగానే ఉండటం గమనార్హం. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ.. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత 4 శాతం లక్ష్యానికన్నా పైనే కొనసాగుతోంది. 2017 అక్టోబర్‌లో చివరిసారిగా నాలుగు శాతానికి దిగువన 3.58 శాతంగా ఇది నమోదైంది. ద్రవ్యోల్బణం గణాంకాలను బట్టే ఆర్‌బీఐ పాలసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ధరల పెరుగుదలపై సందేహాలతోనే ఇటీవలి పాలసీ సమీక్షలో కీలక రేట్లను య«థాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌వో) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ధరల పెరుగుదల ఫిబ్రవరిలో 17.57 శాతంగా ఉండగా.. మార్చిలో 11.7 శాతానికి తగ్గింది. ఇక గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల రేట్లు కూడా నెమ్మదించాయి. మొత్తం మీద ఆహార పదార్థాల విభాగానికి సంబంధించి ధరల పెరుగుదల ఫిబ్రవరిలో 3.26 శాతంగా ఉండగా.. గత నెల 2.81 శాతానికి తగ్గింది.  ఇంధనం, విద్యుత్‌కి సంబంధించిన ద్రవ్యోల్బణం కూడా నెలవారీ ప్రాతిపదికన చూస్తే 5.73 శాతానికి పరిమితమైంది. 

మరిన్ని వార్తలు