RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..

7 Oct, 2023 05:05 IST|Sakshi

4% ద్రవ్యోల్బణమే ఆర్‌బీఐ లక్ష్యం

6.5 శాతం రెపో కొనసాగింపునకు పాలసీ కమిటీ ఏకగ్రీవ ఓటు

ఈ తరహా నిర్ణయం వరుసగా నాల్గవసారి

వ్యవస్థలో అదనపు  ద్రవ్య లభ్యత తగ్గింపునకు చర్యలు

6.5 శాతం జీడీపీ వార్షిక వృద్ధి అంచనా

ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతంగా ఉంటుందని భరోసా

ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి.

రిటైల్‌ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని  ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్‌ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది.  ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాకు తెలిపారు. ‘ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్‌ 2, మైనస్‌ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే.

పాలసీ ముఖ్యాంశాలు...
► 2023–24లో జీడీపీ 6.5 శాతం.
► రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం.
► అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుల బుల్లెట్‌ రీపేమెంట్‌ స్కీమ్‌ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు.

రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు..
రూ.2,000 నోట్లను అక్టోబర్‌ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్‌బీఐ కలి్పంచింది. గవర్నర్‌ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్‌ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు.  అక్టోబర్‌ 8 నుండి 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్‌ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్‌ 30 వరకు గడువిచి్చన ఆర్‌బీఐ, ఈ తేదీని అక్టోబర్‌ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్‌బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్‌ శాఖ సేవలను పొందవచ్చని దాస్‌ సూచించారు. 

కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు..
ఆర్‌బీఐ 2022 మే నుంచి 250 బేసిస్‌ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది.               
    – శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది.  
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చీఫ్‌

ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు.  
– సుభ్రకాంత్‌ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్‌

వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్‌బీఐ ధ్యేయంగా కనబడుతోంది
–  ప్రసేన్‌జిత్‌ బసు,   చీఫ్‌ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
 

మరిన్ని వార్తలు