ఆర్‌ఐఎల్‌ ఆస్తుల్లో 40వేల కోట్ల తరుగుదల

20 Jan, 2017 01:14 IST|Sakshi
ఆర్‌ఐఎల్‌ ఆస్తుల్లో 40వేల కోట్ల తరుగుదల

కేజీ డీ6పైనే రూ.20,114 కోట్లు...
న్యూఢిల్లీ: అకౌంటింగ్‌ విధానంలో మార్పు దృష్ట్యా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రూ.39,570 కోట్ల మేరకు తన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఆస్తుల విలువను రద్దు (రైట్‌డౌన్‌) చేసింది. ఇందులో కేజీ బేసిన్‌లోని డీ6తోపాటు అమెరికా షేల్‌ గ్యాస్‌ ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. 2016 ఏప్రిల్‌ 1 నుంచి ఆర్‌ఐఎల్‌ భారతీయ అకౌంటింగ్‌ ప్రమాణాల పరిధిలోని నూతన విధానానికి మళ్లింది. ఈ మార్పు నేపథ్యంలో తన చమురు, సహజవాయువుల నిల్వలను ఆర్‌ఐఎల్‌ తిరిగి ప్రకటించింది.

2016 మార్చి 31 నాటికి తన ఆయిల్, గ్యాస్‌ ఆస్తుల విలువలో రూ.39,750 కోట్ల తరుగుదలను చూపించింది. కేవలం ఒక్క కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్‌కు సంబంధించే రూ.20,114 కోట్ల తరుగుదలను చూపించింది. ఈ వివరాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల నివేదికలో ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. విలువ తరుగుదలకు ఆయిల్, గ్యాస్‌ ధరల పతనమే ప్రధాన కారణం. ఇక స్వాధీనం చేసిన బ్లాక్‌లు, ఫలితమివ్వని బావులు, విడిచిపెట్టిన బావులు వంటివి ప్రభావం చూపినట్టు ఆర్‌ఐఎల్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు