ఔషధాల ప్యాకింగ్ కు పెట్ బాటిల్స్ సేఫ్..

19 Mar, 2016 01:34 IST|Sakshi

తేల్చిచెప్పిన ఎక్స్‌పర్ట్ కమిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ ప్యాకింగ్‌కు పెట్ బాటిల్స్ భద్రమేనని ఎక్స్‌పర్ట్ కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నియమించిన కమిటీ ఈ మేరకు తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించింది. పాలీథిలీన్ టెరిథలేట్ (పెట్) బాటిళ్ల నుంచి రసాయనాలు వెలువడినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని నివేదికలో స్పష్టం చేసింది. పెట్ తయారీ విధానంలో థలేట్స్ లేదా ప్లాస్టిసైజర్లు వాడే అవసరం లేదని తెలిపింది. నేషనల్ టెస్ట్ హౌజ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలాజికల్ రిసర్చ్ పరీక్షల తీరు కఠినంగా లేదని ఆక్షేపించింది. భారత్‌లో మరింత ఉన్నత ప్రమాణాలు తీసుకు రావాలని సూచించింది. కమిటీ రిపోర్ట్ రూ.4,000 కోట్ల విలువైన భారత పెట్ ప్యాకేజింగ్ పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చింది. ఏటా 6 లక్షల టన్నుల పెట్ ఉత్పత్తిలో ఔషధ రంగం 16 శాతం వినియోగిస్తోంది. డ్రగ్ ఫార్ములేషన్ల ప్రాథమిక ప్యాకేజింగ్ ప్రభావం మానవుల ఆరోగ్యంపై, పర్యావరణంపై ఏ విధంగా ఉంటుందో అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను స్వచ్ఛంద సంస్థ అయిన హిమ జాగృతి ఉత్తరాంచల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ  శాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి భాన్ చైర్మన్‌గా పలువురి నిపుణులతో కమిటీ ఏర్పాటయ్యింది.

మరిన్ని వార్తలు