టెక్‌ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే..

3 Dec, 2023 07:52 IST|Sakshi

కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌, హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధ భయాలు, అమెరికాలో ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచడం.. వంటి వాటితో అంతర్జాతీయ సంస్థలు వాటి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లపై చేసే ఖర్చు తగ్గిస్తున్నాయి. దాంతో ఐటీ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరుతో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. ఆ రంగంలో చదువు పూర్తి చేసుకున్న యువతకు, వారికి వివిధ కంపెనీల్లో ఉంటున్న ఖాళీలకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. కొన్ని కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

దేశంలోని అనేక టెక్ కంపెనీలకు ప్రస్తుతం ఆదాయాలు తగ్గటంతో ఖర్చులు తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీలో పూర్తి సమయం ఉద్యోగులకు బదులు ఎక్కువ మంది అప్రెంటీస్‌లను నియమించుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్రెంటీస్ స్కిల్ ట్రెండ్స్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. ఐటీ/ ఐటీఈఎస్‌ కంపెనీలు ఫుల్‌టైమ్‌ ఉద్యోగుల బదులుగా అప్రెంటిస్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. అప్రెంటిస్‌ ఉద్యోగుల సంఖ్య వార్షికంగా 250 శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

ఐటీ/ ఐటీఈఎస్‌ పరిశ్రమల్లోని దాదాపు 79 శాతం కంపెనీల మేనేజ్‌మెంట్‌ రాబోయే రోజుల్లో అప్రెంటిస్‌ల సంఖ్య పెంచనుందని అంచనా. అప్పుడే చదువు పూర్తై ఉద్యోగ వేటలో పడిన ప్రతిభావంతులైన ఉద్యోగార్థులకు అవకాశం కల్పించాలని కంపెనీలు భావిస్తున్నాయి. వారు ప్రారంభంలో కొంత తక్కువ జీతానికి పనిచేస్తారు. ఎలాగూ శిక్షణ ఇస్తారు కాబట్టి కొంత ప్రాజెక్ట్‌ ఆలస్యం అవుతుందనిపిస్తే ఎక్కువ సేపు పనిచేసేలా ప్రోత్సహిస్తారు. గత సంవత్సర కాలంలో ఈ ట్రెండ్ మెట్రో, టైర్-2 నగరాల్లో ఈ నియామకాలు గణనీయంగా పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీలు అప్రెంటిస్ పూర్తైన వారిలో 75 శాతం మందిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా మార్చాయి.

2023లో కోయంబత్తూర్, హైదరాబాద్, పుణె వంటి నగరాలు అప్రెంటిస్ నియామకానికి మార్గం సుగమం చేశాయి. టైర్-2 నగరంగా ఉన్న కోయంబత్తూర్ అంతటా అప్రెంటిస్‌షిప్ విధానం అధికం అవుతోంది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మెట్రో నగరాలు అప్రెంటిస్ నియామకంలో దూకుడు పెంచాయి. రాష్ట్రాల పరంగా గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్‌మెంట్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం..

ప్రస్తుతం అప్రెంటిస్‌లుగా ఉన్న 9 లక్షల మందికి పైగా యువత 23-26 ఏళ్ల మధ్య వయసు వారే. వీరికి రూ.11 వేలు నుంచి రూ.75 వేల వరకు చెల్లిస్తున్నారు. విద్యార్హతలను బట్టి ఇతర రంగాల్లో చెల్లించే స్టైపెండ్‌లో మార్పులు ఉ‍న్నాయి.

మరిన్ని వార్తలు