‘ప్యాకేజీ’ జోష్‌; 2 లక్షల కోట్ల ప్లస్‌

14 May, 2020 01:45 IST|Sakshi

పై స్థాయిల్లో లాభాల స్వీకరణతో దిగొచ్చిన సూచీ

637 పాయింట్లు పెరిగి 32,009కు సెన్సెక్స్‌ 

నిఫ్టీ 87 పాయింట్లు ప్లస్‌; 9,384 వద్ద క్లోజ్‌

కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి భారీ ప్యాకేజీని ఇవ్వనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అభయమివ్వడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ఆరంభ లాభాలను కొనసాగించలేకపోయినప్పటికీ, సెన్సెక్స్‌ 32,000 పాయింట్లపైకి ఎగబాకగా,  నిఫ్టీ 9,400 పాయింట్లకు చేరువ అయింది.  డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, ముడి చమురు ధరలు 1 శాతం మేర తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 1,476 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 637 పాయింట్లు పెరిగి 32,009 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 9,384 పాయింట్ల వద్దకు చేరింది.  

అరగంటలోనే సగం లాభాలు ఆవిరి..
భారీ ఆర్థిక ప్యాకేజీ నేపథ్యంలో మన స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, సెన్సెక్స్‌ 1,471 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల(నిఫ్టీకి ఇదే ఇంట్రాడే గరిష్ట లాభం) లాభాలతో మొదలయ్యాయి. వెంటనే సెన్సెక్స్‌ 1,474 పాయింట్లతో ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో  ఈ లాభాల సంబరం అరగంటే కొనసాగింది. ఆ తర్వాత సూచీలు దాదాపు సగానికి పైగా లాభాలను కోల్పోయాయి.   

బ్యాంక్, లోహ, వాహన షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి.  కరోనా 2.0 కేసులు మరింతగా పెరుగుతుండటంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్‌
మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

► యాక్సిస్‌ బ్యాంక్‌ 7 శాతం లాభంతో రూ.414 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.

►30 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు–నెస్లే ఇండియా,సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్‌లు మాత్రమే నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి.  

► ఉద్దీపన చర్యలపై ఆశలతో రియల్టీ షేర్లు రివ్వున ఎగిశాయి.

►ఐఆర్‌సీటీసీ షేర్‌  5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ. 1,436కు చేరింది.

ఇన్వెస్టర్ల సంపద 2 లక్షల కోట్ల ప్లస్‌
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2  లక్షల కోట్ల మేర ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.98 లక్షల కోట్లు ఎగసి రూ.124.68 లక్షల కోట్లకు పెరిగింది.

>
మరిన్ని వార్తలు