మూడో రోజూ లాభాల ప్రయాణం

17 Oct, 2018 00:30 IST|Sakshi

297 పాయింట్ల లాభంతో 35వేలపైకి సెన్సెక్స్‌

72 పాయింట్ల లాభంతో 10,585కు నిఫ్టీ

కలిసొచ్చిన రూపాయి రికవరీ

ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ బుల్స్‌ జోరు కొనసాగింది. మంగళవారం డాలర్‌తో రూపాయి 35 పైసలు బలపడి 73.48 స్థాయికి చేరుకోవడం, కార్పొరేట్‌ కంపెనీల ఫలితాల సీజన్‌ ఆశాజనకంగా ఆరంభం కావడంతో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్‌ 297 పాయింట్లు పెరిగి 35,000 మార్కుపైన 35,162 వద్ద  క్లోజయింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 10,585 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,215.79 వరకు వెళ్లింది.

అటు నిఫ్టీ సైతం కీలకమైన 10,600 స్థాయిని అధిగమించి 10,604.90 వరకు పెరిగి, ఆ తర్వాత అమ్మకాలతో ఆ మార్క్‌కు దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఇటీవల నష్టాల బాట పట్టిన మార్కెట్లు... కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలకు ముందు తిరిగి గాడిన పడ్డాయని బ్రోకర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆసియా, మార్కెట్లు లాభాల్లో మొదలు కావడం దేశీయ మార్కెట్లకు సానుకూల సంకేతాన్నిచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కాస్తంత చల్లబడడం, యూరోప్‌ మార్కెట్లు సైతం లాభాల్లో మొదలు కావడం లాభాలు కొనసాగేలా చేశాయి. బ్రెండ్‌ క్రూడ్‌ పావు డాలర్‌ మేర తగ్గి 80.58 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది. సానుకూల సెంటిమెంట్‌   కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ ఆశాజనకంగా ఆరంభం కావడంతోపాటు రూపాయి బలపడడం మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ఈ ర్యాలీ మార్కెట్‌ వ్యాప్తంగా జరగ్గా, ఫైనాన్షియల్స్‌ స్టాక్స్‌ ముందున్నాయి. ఫలితాల సీజన్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశించనుందని విశ్లేషణ.

3 రోజుల్లో రూ.5.30 లక్షల కోట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడు రోజులు లాభపడడంతో... ఇన్వెస్టర్ల సంపద రూ.5.30 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల  మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5,30,936 కోట్లు పెరిగి రూ.141,01,339 కోట్లకు చేరుకుంది.

మార్కెట్‌ క్యాప్‌లో మల్లీ రిలయన్సే నంబర్‌1
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి మార్కెట్‌ క్యాప్‌లో దేశంలోనే నంబర్‌ 1 కంపెనీగా నిలిచింది. మంగళవారం ఆర్‌ఐఎల్‌ షేరు 2.09%పెరిగి రూ.1,163.65 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. టీసీఎస్‌ షేరు 0.64 శాతం లాభంతో 1,961.70 వద్ద స్థిరపడింది. క్లోజింగ్‌ ధర ప్రకారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,37,576.57 కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు