ఎల్‌ఐసీ లాభం 7,925 కోట్లు

11 Nov, 2023 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 7,925 కోట్లకు పరిమితమైంది.

గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 15,952 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం సైతం రూ. 1,32,632 కోట్ల నుంచి రూ. 1,07,397 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే తొలి ఏడాది ప్రీమియం రూ. 9,125 కోట్ల నుంచి రూ. 9,988 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం రూ. 2,22,215 కోట్ల నుంచి రూ. 2,01,587 కోట్లకు నీరసించింది.

పెట్టుబడుల నుంచి మాత్రం ఆదాయం రూ. 93,942 కోట్లకు ఎగసింది. గత క్యూ2లో రూ. 84,104 కోట్లు లభించింది. స్థూల మొండిబకాయిలు 5.6 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి.  ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 610 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు