మూరత్‌ ట్రేడింగ్‌ ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?

11 Nov, 2023 08:42 IST|Sakshi

ముంబై: సంవత్‌ 2079 ఏడాదికి స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో వీడ్కోలు పలికింది. ట్రేడింగ్‌ చివర్లో మెటల్, ఫైనాన్స్, విద్యుత్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 251 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరికి 72 పాయింట్ల లాభంతో 64,905 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 66 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఆఖరికి 30 పాయింట్లు పెరిగి 19,425 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్, ఆటో, టెక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక ద్రవ్యోల్బణ కట్టడికి అవసరమైతే కఠిన ద్రవ్య పాలసీ విధాన అమలుకు వెనకాడమని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.  

ఈ సంవత్‌ 2079 ఏడాదిలో సెన్సెక్స్‌ 5,073 పాయింట్లు, నిఫ్టీ 1,694 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇదే కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.44 లక్షల కోట్లు పెరిగింది.  

ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు లిస్టింగ్‌ రోజు 15% లాభాలు పంచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.60)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.71 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 24% ర్యాలీ చేసి రూ.75 వద్ద గరిష్టాన్ని తాకింది. చివర్లో లాభాల స్వీకరణతో 15% లాభంతో రూ.69 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3,555 కోట్లుగా నమోదైంది. 
 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ 4 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 83.33 స్థాయి వద్ద స్థిరపడింది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉపసంహరణ, క్రూడాయిల్‌ ధరల్లో అస్థిరతలు దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. ఈ సెప్టెంబర్‌ 18న 83.32 స్థాయి వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ డేటా  రూపాయి గమనాన్ని నిర్ధేశిస్తాయని ట్రేడర్లు పేర్కొన్నారు.

ఆదివారం మూరత్‌ ట్రేడింగ్‌ 
దీపావళి సందర్భంగా స్టాక్‌ ఎక్సే్చంజీలు ఆదివారం గంట పాటు ప్రత్యేక ‘మూరత్‌ ట్రేడింగ్‌’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్‌ ముగియనుంది. ఈ ఘడియల్లో షేర్లు కొనుగోలు చేస్తే మంచి లాభాలు గడిస్తాయిని మార్కెట్‌ వర్గాల నమ్మకం. బలిప్రతిపద సందర్భంగా నవంబర్‌ 14న(మంగళవారం) ఎక్సే్చంజీలకు సెలవు.

మరిన్ని వార్తలు