ప్యాకేజీ ఆశలతో కొనుగోళ్లు

7 May, 2020 05:46 IST|Sakshi

కలసివచ్చిన వేల్యూబయింగ్‌ 

232 పాయింట్ల లాభంతో 31,686కు సెన్సెక్స్‌ 

65 పాయింట్లు పెరిగి 9,271కు నిఫ్టీ

గత రెండు రోజుల్లో నష్టపోయిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. కేంద్రం ఉద్దీపన చర్యలను ప్రకటించగలదన్న ఆశలు సానుకూల ప్రభావం చూపించాయి. అయితే సేవల రంగం గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటం, భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులు అంచనాలు ఏమంత ఆశావహంగా లేకపోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసల మేర తగ్గడం.. లాభాలకు కళ్లెం వేశాయి. రోజంతా 812 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 232 పాయింట్ల లాభంతో 31,686 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 9,271 పాయింట్ల వద్దకు చేరింది.  

ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌...
లాక్‌డౌన్‌ కారణంగా గత నెలలో సేవల రంగం కార్యకలాపాలు భారీగా తగ్గాయి. మార్చిలో 49.3గా ఉన్న ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ గత నెలలో 5.4కు తగ్గింది. ఈ ఇండెక్స్‌కు సంబధించి గణాంకాలు మొదలైనప్పటినుంచి (డిసెంబర్, 2005)చూస్తే, గత నెలలో సేవల రంగంలో ఇదే అత్యంత భారీ పతనం. కాగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు.  

► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 5 శాతం లాభంతో రూ.387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  

► కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై రూ.10, లీటర్‌ డీజిల్‌పై రూ.13 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. అంతే కాకుండా ఈ పెంచిన సుంకాన్ని కంపెనీలే భరించాలంటూ పేర్కొంది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా పతనమయ్యాయి. హెచ్‌పీసీఎల్‌6 శాతం, ఐఓసీ 3 శాతం, బీపీసీఎల్‌ 1 శాతం మేర నష్టాల్లో ముగిశాయి. ఈ షేర్లు ఇంట్రాడేలో 7–13% మేర పతనమయ్యాయి.   

► స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆప్‌ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా ఐటీసీలో ఉన్న వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలతో ఐటీసీ షేర్‌ 6 శాతం నష్టంతో రూ.164కు చేరింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే కావడం గమనార్హం.

► మార్కెట్‌ లాభాల్లో ఉన్నా  వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీవీఆర్, ఓల్టాస్, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు