షిర్డీకి విమాన ప్రయాణం..

19 Mar, 2016 01:19 IST|Sakshi
షిర్డీకి విమాన ప్రయాణం..

మే-జూన్‌లో అందుబాటులోకి
హైదరాబాద్ నుంచీ సర్వీసులు
ఎయిర్‌పోర్టుకు ఏఏఐ గ్రీన్‌సిగ్నల్ 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎంతో కాలంగా సాయిబాబా భక్తులు ఎదురు చూస్తున్న విమాన ప్రయాణం త్వరలో సాకారం అవుతోంది. షిర్డీ సమీపంలో మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయంలో పనులు చకచకా సాగుతున్నాయి. రన్‌వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తోపాటు నీరు, విద్యుత్ సరఫరా పూర్తి కావాల్సి ఉంది. 2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే నిర్మించారు. విమానాశ్రయంలో ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ప్రైవేటు విమానాలకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుందని ఎంఐడీసీ అధికారులు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

 శతాబ్ది ఉత్సవాల కోసం..: 1918 అక్టోబరు 15న బాబా మహా సమాధి అయ్యారు. 100 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా షిర్డీ సాయి సంస్థాన్ 2018లో సాయి శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముందే విమానాశ్రయం తొలి దశ పూర్తి చేయాలన్నది ఎంఏడీసీ భావన. తొలి దశలో 350 ఎకరాల్లో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు వ్యయం రూ.380 కోట్లు. ఇందులో షిర్డీ సంస్థాన్ రూ.45 కోట్లు సమకూరుస్తోంది. ఇప్పటికే రూ.240 కోట్లు వ్యయం చేశారని ఎంఏడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంగేష్ కులకర్ణి వెల్లడించారు. ఎయిర్‌పోర్టులో గంటకు 300 మంది ప్రయాణికులకు సేవలందించే వీలవుతుందని చెప్పారు. రెండో దశలో రన్‌వేను 3,200ల మీటర్ల పొడవుకు పెంచుతారు.

హైదరాబాద్ నుంచీ..
మార్చి 2న తొలి విమానం ముంబై నుంచి షిర్డీలో దిగింది. ల్యాండింగ్, విమానాశ్రయంలోని సౌకర్యాలను పరిశీలించిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంతృప్తి వ్యక్తం చేసి విమాన రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో షిర్డీకి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నుంచి విమాన సర్వీసులు నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దుబాయి, సింగపూర్‌కు చెందిన భక్తులూ సర్వీసులు కోరుతున్నారని ఏంఏడీసీ ఈడీ విశ్వాస్ పాటిల్ వెల్లడించారు. కాగా, ఎంఏడీసీ మహారాష్ట్రలో షోలాపూర్, అమరావతి, ధూలే, చంద్రపూర్‌లో ఉన్న ఎయిర్‌స్ట్రిప్స్‌ను అభివృద్ధి చేస్తోంది. గడ్చిరోలిలో హెలిపోర్ట్ రానుంది. పుణేలో రూ.10 వేల కోట్లతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరిస్తోంది. ఇక్కడ రూ.3,000 కోట్లతో మల్టీమోడల్ ఇంటర్నేషనల్ హబ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని వార్తలు