రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్‌ విస్తరణ

29 Nov, 2019 02:40 IST|Sakshi

ప్రాసెసింగ్, స్టోరేజీ సామర్థ్యం పెంపు

త్వరలో కంపెనీ నుంచి ఫ్రోజెన్‌ చికెన్‌

రెడీ టు ఈట్‌ విభాగంలోకి సైతం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్‌ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్‌ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్‌ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్‌ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకల్‌ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్‌ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి ఉంది. సంస్థ ఇప్పటికే ప్రాసెస్డ్‌ చికెన్, ఫ్రెష్‌ చికెన్‌ విక్రయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అలాగే ప్రాసెసింగ్‌ కెపాసిటీ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనిమిది నెలల్లో ఈ విస్తరణ పూర్తి అవుతుందని స్నేహా ఫామ్స్‌ ఎండీ డి.రామ్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. నూతన విభాగాల్లోకి ప్రవేశించేందుకు తాజా విస్తరణ దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెగా ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని చెప్పారు.  

కొత్త విభాగాల్లోకి స్నేహా...
స్నేహా ఫామ్స్‌ త్వరలో నగ్గెట్స్, లాలీపాప్స్‌ వంటి రెడీ టు కుక్, చికెన్‌ కర్రీ వంటి ఉత్పత్తులతో రెడీ టు ఈట్‌ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అయిదారు ఉత్పత్తులతో ట్రయల్స్‌ నిర్వహించామని రామ్‌రెడ్డి తెలిపారు. ‘ఫ్రోజెన్‌ చికెన్‌ విభాగంలోకి కూడా వస్తున్నాం. రెడీ టు ఈట్‌ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పటికే దాణాను ఎగుమతి చేస్తున్నాం. సఫల బ్రాండ్‌ కింద సోయా, రైస్‌ బ్రాన్‌ ఆయిల్స్‌ దేశీయంగా విక్రయిస్తున్నాం. 80,000 కిలోల ప్రాసెస్డ్‌ చికెన్, 2.5 లక్షల బ్రాయిలర్‌ కోళ్లు ప్రతిరోజు అమ్ముతున్నాం. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.3,000 కోట్లుంది. ఇందులో స్నేహా ఫామ్స్‌ వాటా రూ.2,500 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌లో 15–20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణతో కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు