స్పైస్‌జెట్‌ ఎయిర్‌ కార్గో సర్వీసులు

11 Sep, 2018 00:31 IST|Sakshi

స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఈ నెల 18 నుంచి ఆరంభం

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ కంపెనీ ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయి ఎయిర్‌ కార్గో సర్వీసులను ప్రారంభించనుంది. స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ కింద ఈ ఎయిర్‌ కార్గో సర్వీసులను అందిస్తామని స్పైస్‌జెట్‌ సీఎమ్‌డీ అజయ్‌ సింగ్‌ చెప్పారు.  పూర్తి స్థాయి ఎయిర్‌ కార్గో సేవలను అందిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థ తమదేనని పేర్కొన్నారు.. బోయింగ్‌ 737–700 విమానాన్ని దీని కోసం వినియోగిస్తామని, ఇది 20 టన్నుల కార్గోను రవాణా చేయగలదని, తొలి సర్వీస్‌ను ఢిల్లీ నుంచి బెంగళూరుకు నిర్వహిస్తామని తెలిపారు. 

ఆరంభంలో గౌహతి, హాంకాంగ్, కాబూల్, అమృత్‌సర్‌లకు ఎయిర్‌ కార్గో సర్వీసులను అందిస్తామని పేర్కొన్నారు.  తాజా పండ్లు, కూరగాయలను పశ్చిమాసియా ప్రాంతానికి రవాణా చేస్తామని వివరించారు. ఐదేళ్లలో ఎయిర్‌ కార్గో ట్రాఫిక్‌ 60 శాతం వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్‌ కార్గో సర్వీసుల కోసం నాలుగు విమానాలను కేటాయిస్తామని, కెపాసిటీని రోజుకు 900 టన్నులకు పెంచుతామని తెలిపారు.

తమ అనుబంధ వ్యాపార వృద్ధికి ఈ ఎయిర్‌కార్గో సర్వీసులు ఇతోధికంగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, రూపాయి  పతనం, ముడిచమురు ధరల మంట నేపథ్యంలో మరో 2–3 నెలల్లో విమానయాన చార్జీలు పెరిగే అవకాశం ఉందని అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు