ఎక్కువ పని చేయడానికి అనుమతించం.. మోతీలాల్‌ఓస్వాల్‌ కీలక నిర్ణయం

9 Nov, 2023 14:24 IST|Sakshi

అధిక పని గంటలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగం మానేద్దామంటే ద్రవ్యోల్బణం కారణంగా ఇతర కంపెనీల్లో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. జీతాల పెరుగుదల అంతంతమాత్రమే. దానికితోడు వారానికి డెబ్బై గంటల పనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌లో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తూ.. ఉన్నవారితో ఎలా ఎక్కువసేపు పనిచేయించుకోవాలో ఆలోచిస్తున్నాయి.

అందుకు విరుద్ధంగా మోతీలాల్‌ఓస్వాల్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. పని గంటలపై చర్చ కొనసాగుతున్నప్పటికీ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం 8-8.5 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి అనుమతించరు. ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ నిరేన్ శ్రీవాస్తవ తెలిపారు.

పని సమయం ముగిసిన వెంటనే కంపెనీ ఈమెయిల్ సర్వర్‌లను ఆపేస్తామన్నారు. 45 నిమిషాల గ్రేస్‌ పిరియడ్‌ తర్వాత కంపెనీ తరఫున ఎలాంటి ఈమెయిల్‌లు పంపడం, స్వీకరించడం జరగదని చెప్పారు. ఎవరైనా షిఫ్ట్ సమయానికి మించి కార్యాలయంలో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. 

కొత్త పాలసీని ఉద్దేశించి సంస్థ ఎండీ, సీఈఓ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. తమకు పని గంటల సంఖ్య ముఖ్యం కాదని ఉద్యోగుల మనశ్శాంతి, సంతృప్తి, ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న సంస్థలోని కొందరు ఉన్నత అధికారులకు వారి సొంత పని షెడ్యూల్‌ కారణంగా ఈ పాలసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విధానాన్ని సంస్థ అన్ని కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. కొత్త పాలసీ సంస్థలో పనిచేస్తున్న 11,000 మందిలో దాదాపు 9,500 మందికి వర్తిస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు