ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము

19 Dec, 2017 02:35 IST|Sakshi

రూ. 168 కోట్ల గ్యాస్‌ సబ్సిడీ నిధులు

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌... లాంఛనంగా కస్టమర్ల అనుమతి తీసుకోకుండా తెరిచిన ఖాతాల్లో భారీ స్థాయిలో గ్యాస్‌ సబ్సిడీ మొత్తాలు జమయ్యాయి. 37.21 లక్షల వినియోగదారులకు చెందిన రూ. 167.7 కోట్ల సొమ్ము ఈ ఖాతాల్లో డిపాజిట్‌ అయినట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు (ఐవోసీ)కి 17.32 లక్షల మంది వినియోగదారుల ఖాతాల్లో రూ.88.18 కోట్లు జమయ్యాయి.

హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వినియోగదారులు 10.06 లక్షల మందికి చెందిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.40 కోట్లు, 9.8 లక్షల మంది భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) వినియోగదారులకు చెందిన ఖాతాల్లో రూ. 39.46 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. 37.21 లక్షల ఖాతాదారుల అకౌంట్లన్నీ కూడా... ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తెరిచినవేనని సదరు అధికారి పేర్కొన్నారు.

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌.. సిమ్‌ వెరిఫికేషన్‌ కోసం ఉపయోగించాల్సిన ఆధార్‌ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియను దుర్వినియోగం చేసిందని, వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండా.. వారి అనుమతి తీసుకోకుండానే తన పేమెంట్స్‌ బ్యాంక్‌లో వారి పేరిట ఖాతాలను తెరిచిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ సంస్థల ఈకేవైసీ లైసెన్స్‌లను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది కూడా.

ఆ డబ్బు తిరిగిచ్చేస్తాం: ఎయిర్‌టెల్‌
పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాల్లోకి చేరిన గ్యాస్‌ సబ్సిడీ నిధులను వాపసు చేయాలంటూ చమురు సంస్థలు ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి పెంచడం ప్రారంభించాయి. హెచ్‌పీసీఎల్‌ దీనిపై ఇప్పటికే ఎయిర్‌టెల్‌కి లేఖ కూడా రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాల్లోకి వచ్చిన రూ. 190 కోట్ల గ్యాస్‌ సబ్సిడీ మొత్తాన్ని.. లబ్ధిదారుల అసలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామంటూ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. వడ్డీతో సహా ఈ మొత్తాన్ని చెల్లిస్తామంటూ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కి లేఖ రాసింది. మరోవైపు నగదు బదిలీ ప్రక్రియను కూడా మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.      

మరిన్ని వార్తలు