చంద్రయాన్‌-3 విజయం, భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలపై చర్చ.. కేంద్రం భేటీ కానున్న ఎలాన్‌ మస్క్‌

24 Aug, 2023 17:00 IST|Sakshi

అంతరిక్ష ప్రయోగాల‍్లో భారత్‌ సత్తా చాటుతోంది. దీంతో మరో సారి భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలపై చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ భారతీయులకు శుభవార్త చెప్పనున్నారు. త్వరలో దేశీయంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం భారత్‌ నుంచి అనుమతులు తీసుకోనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

ప్రస్తుతం, మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తుంది. అయితే, గతంలో స్టార్‌లింక్‌ భారత్‌లో శాటిలైట్‌ సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యింది. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 

తాజాగా, సెప్టెంబర్‌ 20న స్టార్‌లింక్‌ ప్రతినిధులు భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం దేశీయ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్‌ (డాట్‌) విభాగం అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే అనుమతులు తీసుకోన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టార్‌లింక్‌ భారత్‌లో గ్లోబుల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాలిలైట్‌ (జీఎంపీసీఎస్‌) లైసెన్స్‌ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 

స్టార్‌లింక్‌తో పాటు ఎయిర్‌టెల్‌
ఇక, భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించే సంస్థల జాబితాలో స్టార్‌లింక్‌తోపాటు ఎయిర్‌టెల్‌, జియోలు పోటీ పడుతున్నాయి. ఎయిర్‌ టెల్‌ వన్‌ వెబ్‌, జియో.. జియో స్పేస్‌ టెక్నాలజీలు ఉపగ్రహ ఇంటర్నెట్‌పై పనిచేస్తున్నాయి.  ఈ రెండు కంపెనీలు సైతం జీఎంపీసీఎస్‌ లైసెన్స్‌ తీసుకున్నాయి.

చదవండి👉 భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ పోటీ.. ముఖేష్ అంబానీ - ఎలాన్‌ మస్క్​లలో ఎవరి మాట నెగ్గుతుందో?

మరిన్ని వార్తలు