‘అరకు’ కాఫీ ఘుమఘుమలు!

14 Dec, 2015 09:28 IST|Sakshi
‘అరకు’ కాఫీ ఘుమఘుమలు!

- మార్కెట్లోకి విడుదల
- తొలిరోజే రూ.10 లక్షల ఆర్డరు
- 50, 100, 200, 500 గ్రాముల్లో లభ్యం
 
సాక్షి, విశాఖపట్నం: అరకు వ్యాలీ కాఫీ మార్కెట్లోకి విడుదలైంది. విశాఖ ఏజెన్సీలో పండిన కాఫీని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తొలిసారిగా రిటైల్ మార్కెట్ ద్వారా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఆదివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు అరకు వ్యాలీ కాఫీ మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖ మన్యంలో ఇప్పటికే లక్ష ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోందని, కాఫీ తోటల అభివృద్ధి పథకంలో భాగంగా రూ.526 కోట్లతో అదనంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను సాగు చేస్తామన్నారు.
 
 గిరిజన రైతులు పండించే కాఫీని పార్చుమెంట్ రకం కిలో రూ.180, చెర్రీ రకం రూ.92కు ఇకపై జీసీసీ కొనుగోలు చేస్తుందని,  దీనివల్ల రైతుకు రెట్టింపు ఆదాయం వస్తుందని, దళారుల బెడద తప్పుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ దళారులు కాఫీ గింజల కొనుగోళ్లతో గిరిజన రైతులు రూ.700 కోట్ల వరకు నష్టపోయినట్టు గుర్తించామన్నారు. ఇక్కడ పండే ఆర్గానిక్ కాఫీకి విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న దృష్ట్యా అరకువ్యాలీ కాఫీని తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెడ్తున్నామన్నారు.
 
 100 టన్నుల కాఫీ అమ్మకాలు లక్ష్యం
 జీసీసీ ఎండీ ఎఎస్‌పీఎస్ రవిప్రకాష్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అరకువ్యాలీ కాఫీకి కూడా అనతికాలంలోనే జాతీయ స్థాయి కాఫీ మార్కెట్‌లో అగ్రగామి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీ కాఫీని ఇప్పటిదాకా విదేశీయులే తప్ప తెలుగు రాష్ట్రాల వారు గాని, దేశీయులు గాని రుచి చూడలేదన్నారు. ఇకపై అరకువ్యాలీ కాఫీతో స్వచ్ఛమైన కాఫీని వీరు రుచి చూడడానికి వీలవుతుందన్నారు. 50, 100, 200, 500 గ్రాముల ప్యాక్‌ల్లో దీనిని జీసీసీ రిటైల్ దుకాణాలు, సూపర్‌మార్కెట్లలోనే కాక ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. తొలి సంవత్సరం రూ.4 కోట్ల విలువైన 100 టన్నుల కాఫీని రిటైల్ మార్కెట్లో అమ్మకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హరినారాయణ, కాఫీ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు