ఐటీ కోర్టు అప్పీల్‌కు ‘వివాద బకాయి’ పరిమితి పెంపు

14 Dec, 2015 09:26 IST|Sakshi
ఐటీ కోర్టు అప్పీల్‌కు ‘వివాద బకాయి’ పరిమితి పెంపు

న్యూఢిల్లీ: అనవసర, కాలయాపన వ్యాజ్యాలకు చెక్ చెప్పే దిశలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో తాజా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం... ఇకపై ఆదాయపు పన్ను శాఖ ఏదైనా కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)లో అప్పీల్‌కు వెళ్లాలంటే.. లిటిగేషన్‌లో ఉన్న  మొత్తం రూ. 10 లక్షల పైబడిన సొమ్ము విషయంలో పన్ను బకాయికి సంబంధించినదై ఉండాలి. ఇంతక్రితం ఈ సొమ్ము రూ.4 లక్షలుగా ఉండేది. హైకోర్టులో కేసు దాఖలుకు ఇంతక్రితం తరహాలో రూ. 10 లక్షలు కాకుండా రూ. 20 లక్షల పైబడి ఉండాలి.
 
 సుప్రీంకోర్టుకు సంబంధించిన పరిధి రూ. 25 లక్షలుకాగా... ఈ మొత్తంలో ఎటువంటి మార్పూ చేయలేదు. పన్ను బకాయిల విషయంలో పన్ను చెల్లింపుదారుడు ఐటీ అసెస్‌మెంట్ ఉత్తర్వుపై కమిషనర్ ఆఫ్ ఐటీ (అప్పీల్స్), ఐటీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే కేవలం ‘సొమ్ము పరిమితి’ అంశం విషయంలో అయితే మాత్రమే అప్పీల్ చేయరాదని, ఇతర మెరిట్స్ సానుకూలంగా ఉంటే... దీనికి అనుగుణంగా అప్పీల్ నిర్ణయం తీసుకోవచ్చని కూడా సీబీడీటీ తన అధికారిక సూచనల్లో వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు