250 కోట్ల విద్యారుణాల లక్ష్యం: అవాన్స్

28 May, 2014 02:27 IST|Sakshi
250 కోట్ల విద్యారుణాల లక్ష్యం: అవాన్స్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనుబంధ కంపెనీ ‘అవాన్స్’ విద్యారుణాలపై మరింత దృష్టిసారించనున్నట్లు తెలిపింది. ఐదేళ్లలో రూ.5,000 కోట్ల విద్యారుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అవాన్స్ పేర్కొంది. గడిచిన ఏడాది రూ. 50 కోట్ల విలువైన రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది రూ. 250కోట్లు ఇవ్వనున్నట్లు అవాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ సక్సేనా తెలిపారు.. హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీరజ్ మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి దేశీయ విద్యా రుణాల విలువ 30 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, ప్రస్తుతం రూ.80,000 కోట్లుగా ఉందన్నారు.

 రాష్ట్రం నుంచి ఏటా 24 లక్షల మంది విద్యార్థులు చేరుతుండటంతో రాష్ట్రమార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారుణాల మార్కెట్ రూ.6,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా. విద్యారుణాలకే కాకుండా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు, వాటికి కావల్సిన ముడిసరుకు సరఫరాలకు సంబంధించిన విభాగాల్లో కూడా రుణాలకు మంచి డిమాండ్ ఉందని, వచ్చే నెల నుంచి వీటికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత విద్యారుణాలకే ఎక్కువ ప్రాధానత్యను ఇస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు