రెండు రోజుల లాభాలకు బ్రేక్‌

9 Jun, 2018 00:55 IST|Sakshi

బలహీనంగా  అంతర్జాతీయ సంకేతాలు 

19 పాయింట్ల నష్టంతో  35,444కు సెన్సెక్స్‌

ఒక పాయింట్‌ నష్టపోయి 10,768కు నిఫ్టీ  

రెండు రోజుల స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది.  ఇటీవల రెండు రోజుల ర్యాలీలో లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, రూపాయి బలహీనంగా ఉండటం, ముడి చమురు ధరలు పెరగడం.. కారణంగా స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 19 పాయింట్ల నష్టంతో 35,444 పాయింట్ల వద్ద, నిఫ్టీ ఒక్క పాయింట్‌ నష్టంతో 10,768 పాయింట్ల వద్ద ముగిశాయి. భారత ఫార్మా కంపెనీలకు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి శుభవార్తలు లభించడంతో పాటు రూపాయి బలహీనపడటంతో  ఫార్మా షేర్లు పెరిగాయి. దీనికి తోడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను గట్టెక్కించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోందన్న వార్తల కారణంగా సూచీల నష్టాలు తగ్గాయి. అంతకు ముందటి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 560 పాయింట్లు లాభపడింది. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా మూడో వారమూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 216 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల చొప్పున పెరిగాయి. 

కీలకమైన జీ7 సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను పడగొట్టింది. కెనడా, ఈయూలపై అమెరికా దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇటు చైనాతోనూ వాణిజ్య ఉద్రిక్తతలున్న నేపథ్యంలో వచ్చే శుక్రవారం కెనడాలో కీలకమైన జీ7 సమావేశం జరగనుండటంతో అందరి కళ్లూ ఈ సమావేశంపైనే ఉన్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌తో సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు రేట్లను పెంచడానికి సిద్దమవుతున్నాయన్న వార్తలు కూడా ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఇక మన దగ్గర పదేళ్ల ప్రభుత్వ బాండ్ల రాబడులు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 8 శాతానికి పైగా పెరగడం ప్రతికూల ప్రభావం చూపించింది. అయితే 15 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల అధినేతలతో ఆర్థిక మంత్రి పీయుష్‌ గోయల్‌ శుక్రవారం సమావేశం నేపథ్యంలో కొన్ని బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. 
ఇంట్రాడేలో 203 పాయింట్ల నష్టం..సెన్సెక్స్‌  రోజంతా తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య కదలాడింది. మొత్తం మీద రోజంతా 225 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 11 పాయింట్లు లాభపడగా, మరో దశలో 59 పాయింట్లు నష్టపోయింది.  

>
మరిన్ని వార్తలు