నెలాఖరున గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్

17 May, 2016 02:10 IST|Sakshi
నెలాఖరున గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్

న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్‌బాండ్(ఎస్‌జీబీ) ట్రేడింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నాలుగో అంచె  సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పుత్తడి సంబంధిత స్కీమ్‌ల ప్రగతిపై సమీక్ష జరపడానికి  ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోల్డ్ బాండ్ ట్రేడింగ్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.  

గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్(జీఎంఎస్) కింద మరింత బంగారాన్ని సమీకరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని బ్యాంక్‌లు ఆదేశించాలన్న నిర్ణయం కూడా తీసుకున్నామని ఆ వర్గాలు వివరించాయి. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్(ఎస్‌టీబీడీ), మీడియమ్ అండ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్(ఎంఎల్‌టీజీడీ) కింద ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.2,891 కేజీల బంగారాన్ని సమీకరించింది.

మరిన్ని వార్తలు