కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

31 Jul, 2019 09:41 IST|Sakshi

‘ట్రాజిక్‌ ఎండ్‌ టూ ది కాఫీ కింగ్‌’

సాక్షి, బెంగళూరు : సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ కథ చివరకు విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీడే యజమాని, మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ సొంతూరు కాఫీ సీమ చిక్కమంగళూరు అయితే ముంబైలో వ్యాపార మెళుకువల్ని ఒంటబట్టించుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ రంగంలో మేటిగా నిలిచారు.

వీజీ సిద్ధార్థ తనకు ఇష్టమైన కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించి ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలతో పాటు పలు దేశాల్లో కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగారు. ఇంతలో అనూహ్యమైన ఆటుపోట్లు వచ్చాయో, ఏమో.. ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలో నేత్రావతి నది వంతెన వద్ద అదృశ్యమైన సిద్ధార్థ చివరకు శవమై తేలారు.


చదవండి: నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం

ఎస్‌ఎం కృష్ణ నివాసంలో విషాదం
వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం కావడంతో మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ నివాసంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎస్‌ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవిక భర్తే సిద్ధార్థ. సదాశివనగరలోని ఉన్న ఎస్‌ఎం కృష్ణ నివాసానికి నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సిద్ధార్థ ఆత్మహత్యతో నగరంలోని రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఎస్‌ఎం కృష్ణ ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు సిద్ధార్థ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పూర్తి చేశారు.

సిద్ధార్థ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

సిద్ధార్థ మృతదేహానికి మంగళూరులోని వెన్‌లాక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా  మంగుళూరు పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఇవాళ ఉదయం నేత్రానదిలో ఓమృతదేహం లభ్యమైందని, దాన్ని అదృశ్యమైన వీజీ సిద్ధార్థగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. సిద్ధార్థ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని, ఆర్థిక సమస్యలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సీపీ వెల్లడించారు. 

‘ట్రాజిక్‌ ఎండ్‌ టూ ది కాఫీ కింగ్‌’
మరోవైపు ఈ విషాద సంఘటనపై ‘ట్రాజిక్‌ ఎండ్‌ టూ ది కాఫీ కింగ్‌’ అని బీజేపీ మహిళా నేత శోభ ట్వీట్‌ చేశారు. అలాగే సిద్ధార్థ ఆత్మహత్యపై శృంగేరి ఎమ్మెల్యే టీడీ రాజేగౌడ మాట్లాడుతూ..‘ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఒత్తిడితో సిద్ధార్థ కొంచెం అప్‌సెట్‌ అయ్యాడు. ఆస్తులు అమ్మి సెటిల్‌ చేద్దామనుకున్నాడు. అతడికున్న అప్పుల కన్నా ఆస్తులే ఎక్కువ. ఇంతలో ఈ దారుణం జరిగింది.’ అని అన్నారు. సిద్ధార్థ ఆత్మహత్య సంఘటన దురదృష్టకరమని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

ఎస్‌ఎం కృష్ణను నిన్న (మంగళవారం) పలువురు ప్రముఖులు పరామర్శించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, డీకే శివకుమార్, మాజీ సీఎం కుమారస్వామి, సిద్దరామయ్య, నటులు శివరాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాఘవేంద్రరాజ్‌కుమార్, మాజీమంత్రులు ఆర్‌.వి.దేశ్‌పాండే, శివశంకర్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఆర్‌.అశోక్, కట్టా సుబ్రమణ్యం నాయుడు, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, హెచ్‌కే. పాటిల్‌ తదితరులు ఎస్‌ఎం కృష్ణను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు