కొనుగోళ్ల జోరు

29 Sep, 2018 03:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) బిల్లులతో స్థిరాస్తి రంగంలో పారదర్శకత నెలకొంది. దీంతో రియల్టీలోకి ప్రవాసులు, హెచ్‌ఎన్‌ఐల పెట్టుబడులు రావటం పెరిగింది. అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లు ప్రతికూలంలో ఉండటంతో అయా దేశాల్లోని ప్రవాసులను మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

గృహ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, మూలధన రాబడి, పన్ను ప్రయోజనాలు వంటివి కూడా కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలు. స్వల్ప కాలంలో అధిక రాబడి కారణంగా కొందరు లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తుంటే, మరికొందరేమో ఆధునిక వసతులు, భద్రత వంటి కారణంగా పాత గృహాలను అమ్మేసి మరీ లగ్జరీ ఫ్లాట్లను కొం టున్నారని డెవలపర్‌ చెప్పారు.

నగరంలో ప్రీమియం గృహాల సప్లయి తక్కువగా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదును బ్యాంకులో దాచుకోవటం లేక బయట వడ్డీలకు ఇవ్వటం చాలా వరకు తగ్గింది. దీని బదులు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలో అధిక రాబడులు పొందొచ్చనే అభిప్రాయం కస్టమర్లలో పెరిగిందని.. ఇవే హైదరాబాద్‌లో ప్రీమియం గృహాల కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలని ఓ డెవలపర్‌ తెలిపారు.

పశ్చిమ జోన్‌లోనే ఎక్కువ..
ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన పశ్చిమ జోన్‌లోనే లగ్జరీ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నార్సింగి, గండిపేట్‌ వంటి ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. ‘‘సుమారు 6 వేల చ.అ. నుంచి వీటి విస్తీర్ణాలుంటాయి. హోమ్‌ ఆటోమేషన్,  24 గంటలు నీళ్లు, విద్యుత్‌. కట్టుదిట్టమైన భద్రత. లగ్జరీ క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, ఏసీ జిమ్, థియేటర్‌ వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులుంటాయి.

అయితే వసతులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని’’ మరో డెవలపర్‌ తెలిపారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నగరంలో భూముల ధరలు తక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలంగా ఉండటం, కాస్మోపాలిటన్‌ సిటీ, స్థానిక ప్రభుత్వ విధానాలూ వంటివి కూడా ప్రీమియం కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఎన్నారైలు, అధిక వేతనాలుండే ఐటీ, ఫార్మా ఉద్యోగులు, వ్యాపార సంస్థల యజమానులు, ఉన్నతాధికారులు ఈ ఖరీదైన గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంఓ స్టార్టప్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్‌ కంపెనీల ఉద్యోగులూ ఈ జాబితాలో చేరారు.

మరిన్ని వార్తలు