జీఎస్టీపై ప్రభుత్వం వరుస సమావేశాలు! ఏం మార్పులొస్తాయో..

6 Nov, 2023 19:21 IST|Sakshi

వస్తు సేవల పన్ను (GST)తో పాటు ఇతర పరోక్ష పన్నులపై కేంద్ర ప్రభుత్వం త్వరలో వరుస సమావేశాలు నిర్వహించనుంది. జీఎస్టీ ఫైలింగ్‌తోపాటు పరోక్ష పన్ను ప్రక్రియల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ మేరకు జీఎస్టీ సహా పరోక్ష పన్నుల ప్రక్రియలను సమీక్షించడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నవంబర్‌లో వరుస సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ‘మనీ కంట్రోల్‌’ కథనం ప్రచురించింది.

ఈ సమావేశాల్లో జీఎస్టీ పోర్టల్ పనితీరు, పరోక్ష పన్ను ప్రక్రియలు, రిటర్న్‌లను దాఖలు చేయడంలో సౌలభ్యం, సాంకేతిక లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. రాబోయేది పూర్తి బడ్జెట్ కాదు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సమీక్షా సమావేశాలకు సీబీఐసీ, జీఎస్టీఎన్‌తోపాటు అన్ని ఫీల్డ్ యూనిట్ల ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు అక్టోబర్‌లో ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ. 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి ఇప్పటివరకు రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లు. కొత్త ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల ప్రారంభానికి ముందే కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. 

సవరించిన రిటర్న్‌ల దాఖలుకు డిమాండ్‌
జీఎస్టీలో సవరించిన రిటర్న్‌ల దాఖలుకు అవకాశం కల్పించాలని వ్యాపారులు, పన్ను కన్సల్టెంట్ల సంఘాలు కోరుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ట్యాక్స్ లా బార్ అసోసియేషన్, కమర్షియల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆ రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార, పన్ను సంస్థలు ఇటీవల సమావేశమై  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

మరిన్ని వార్తలు