జీఎస్‌టీ పరిధిలోకి అన్ని వ్యాపార సంస్థలు

8 Nov, 2023 09:34 IST|Sakshi

వాపి (గుజరాత్‌): వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయాన్ని పెంచడమే కాకుండా,  అన్ని వ్యాపార సంస్థలను ఈ పరోక్ష పన్ను వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆర్థికశాఖ పనిచేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  అన్నారు. గుజరాత్‌లోని 12 జీఎస్‌టీ సువిధ కేంద్రాలను ఇక్కడ నుంచి ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌లో వ్యాపార సంస్థలకు లోపరహిత వ్యవస్థను అందించడం, ఆయా సంస్థల సవాళ్ల పరిష్కారానికి ఈ కేంద్రాలు దోహదపడతాయన్నారు.

జీఎస్‌టీ వసూళ్లు ఏడాదికాయేడాది పెరుగుతుండడం హర్షణీయ పరిణామమన్నారు.  జీఎస్‌టీ వ్యవస్థలో మునుపటి కాలంతో పోలిస్తే అనేక వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడం జరిగిందన్నారు. చాలా సంస్థలు ఇప్పటికీ జీఎస్‌టీ పరిధికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాయని పేర్కొన్న ఆమె, దీనివల్ల అధికారిక ఆర్థిక వ్యవస్థలో అవి భాగం కాబోవని వివరించారు. కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే కాకుండా, ఎకానమీ పటిష్టతలో భాగం కావడానికి ఆయా సంస్థలు జీఎస్‌టీ పరిధిలోకి రావడం అవసరమన్నారు. ఈ కారణంగా ఇకపై కేవలం పన్ను వసూళ్ల పెరుగుదలపైనే కాకుండా, ఈ పరిధిలోకి వస్తున్న సంస్థల పెరుగుదల రేటును కూడా పరిశీలించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పోర్టల్‌లో చెల్లించిన జీఎస్‌టీ బిల్లులను అప్‌లోడ్‌ చేసిన ఐదుగురికి డ్రా ఆధారంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు బహుకరించారు. తమ బిల్లును అప్‌లోడ్‌ చేసి లాటరీలో గెలవని వారిని కూడా తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్న ఆమె ప్రతి వినియోగదారుడు వారి బిల్లులను అప్‌లోడ్‌ చేసేలా ప్రోత్సహించాలని ఆమె అన్నారు. దేశ ఎకానమీకి ఇది కీలకమని వ్యాఖ్యానించారు.  అహ్మదాబాద్, రాజ్‌కోట్, పంచమహల్స్‌తో సహా గుజరాత్‌లోని 12 వేర్వేరు నగరాల్లో జీఎస్‌టీ సువిధ కేంద్రాలను ప్రారంభించిన ఈ  కార్యక్రమంలో గుజరాత్‌ ఆర్థిక మంత్రి కను దేశాయ్, రాష్ట్ర జీఎస్‌టీ విభాగం అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు