పుత్తడిపై ‘అశోక’ చక్రం

1 Mar, 2015 02:26 IST|Sakshi
పుత్తడిపై ‘అశోక’ చక్రం

- ఇక ఇండియా బ్రాండ్ గోల్డ్ కాయిన్స్..
- మూడు కొత్త స్కీమ్‌ల ఆవిష్కరణ
- బంగారం ధరలు దిగొచ్చే అవకాశం..

న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు తగ్గించడం, ప్రజలు, దేవాలయాల్లో   నిష్ర్పయోజనంగా మూలుగుతున్న  బంగారం  నిల్వలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం   లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మూడు స్కీమ్‌లను ప్రతిపాదించింది. ఈ మూడు స్కీమ్‌లు-సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్‌జీబీ), గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్(జీఎంఎస్), ఇండియా బ్రాండెడ్ గోల్డ్ కాయిన్‌ల కారణంగా పుత్తడి దిగుమతులు తగ్గుతాయని, దేశీయంగా సరఫరా పెరుగుతుందని, ధరలు దిగొస్తాయని నిపుణులంటున్నారు.

బంగారంపై దిగుమతి ఆంక్షలను యథాతథంగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలో 20 వేట టన్నుల బంగారం ఉందని, అయితే ఇది వ్యాపారానికి  పనికిరాక, నిరుపయోగంగా ఉంటోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశం ఇదే. అంతేకాకుండా ప్రతి ఏడాది 800-1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.
 
1. సావరిన్ గోల్డ్ బాండ్
 పుత్తడికి ప్రత్యామ్నాయంగా మరో ఆర్థిక ఆస్తి, సావరిన్ గోల్డ్ బాండ్‌ను అభివృద్ధి చేయాలని ఆర్థిక మంత్రి  ప్రతిపాదించారు. బంగారం కొనుగోళ్లకు ఇది ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో ఈ బాండ్లపై స్థిరమైన వడ్డీరేటును చెల్లిస్తారు.  నగదుగా ఈ బాండ్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఫలితంగా వాణిజ్య లోటు, కరంట్ అకౌంట్ లోటులను నియంత్రించవచ్చు. ప్రజలు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని నివారించడానికి ఈ ఎస్‌జీబీ అందుబాటులోకి తెస్తున్నారు.  
 2. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్: ప్రస్తుతమున్న గోల్డ్ డిపాజిట్,  బంగారు లోహ రుణాల స్కీమ్‌ల స్థానంలో ఈ స్కీమ్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ స్కీమ్‌లో బంగారాన్ని డిపాజిట్ చేసిన వినియోగదారులకు వడ్డీని చెల్లిస్తారు. అదే ఆభరణాల వర్తకులకైతే రుణాలను మంజూరు చేస్తారు. బ్యాంకులు/ఇతర డీలర్లు కూడా తమ వద్దనున్న బంగారాన్ని నగదుగా వ్యవస్థలో చలామణిలోకి తీసుకురావచ్చు.
 3. ఇండియా బ్రాండెడ్ గోల్డ్ కాయిన్: అశోక చక్ర చిహ్నం ఉన్న పుత్తడి నాణాలను దేశీయంగా తయారు చేయడం ప్రారంభించనున్నామని జైట్లీ చెప్పారు. దీంతో విదేశాల నుంచి నాణాల దిగుమతికి డిమాండ్ తగ్గుతుందని, దేశంలో లభ్యమయ్యే పుత్తడిని రీసైకిల్ చేయవచ్చని వివరించారు. తమ అవసరాల నిమిత్తం ప్రజలు విదేశాల నుంచి బంగారు నాణాలు కొనుగోలు చేస్తున్నారని, ఈ కారణంగా మన విదేశీ మారకద్రవ్యం తరిగిపోతోందని చెప్పారు.
 
బంగారం లాంటి స్కీమ్‌లు
బడ్జెట్‌లో పుత్తడి ప్రతి పాదనల పట్ల పుత్తడి పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్‌తో  పుత్తడి దిగుమతులు తగ్గుతాయని, సరఫరా  పెరుగుతుందని, ధర తగ్గుతుందని పేర్కొంది. అయితే పుత్తడిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్ కారణంగా  పుత్తడి దిగుమతులు తగ్గుతాయని, బంగారం సరఫరా  పెరుగుతుందని, కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) తగ్గుతుందని  జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ హరీష్ సోని చెప్పారు. పుత్తడిపై దిగుమతి సుంకం తగ్గించకపోవడం నిరాశపరిచిందని పేర్కొన్నారు. గోల్డ్ మొనైటేజేషన్ స్కీమ్ వల్ల  ఆర్థిక వ్యవస్థలోకి పుత్తడి అందుబాటులోకి వస్తుందని జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) చైర్మన్ విపుల్ షా వెల్లడించారు.
 
ఇండియా బ్రాండెడ్ గోల్డ్ కాయిన్ కారణంగా పుత్తడి ఆర్థిక విలువ మరింతగా పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ(ఇండియా) సోమసుందరం పీఆర్. అభిప్రాయపడ్డారు.  గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్ స్థూల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమని, కోట్లాది కుటుంబాల వద్ద నున్న పుత్తడి పొదుపులు ఆర్థిక పెట్టుబడులుగా మారతాయని వివరించారు. ఈ మూడు స్కీమ్‌ల కారణంగా దేశంలో పుత్తడి సరఫరా పెరుగుతుందని తారా జ్యూయెల్స్ సీఎండీ రాజీవ్ సేథ్ చెప్పారు.  

దిగుమతి సుంకం తగ్గించకపోవడం నిరాశ పరచిందని గీతాంజలి గ్రూప్ సీఎండీ మేహుల్ చోక్సి పేర్కొన్నారు.  రూ.లక్షకు మించి కొనుగోళ్లకు పాన్ నంబర్ తప్పనిసరి చేయడం ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ల కారణంగా నిరుపయోగంగా ఉన్న నిల్వలను వినియోగంలోకి తేవచ్చని జెమ్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈడీ సవ్యసాచి రే చెప్పారు. గుడులు, ఇళ్లలో రూ.47.25 లక్షల కోట్ల విలువైన పుత్తడి నిరుపయోగంగా ఉంటుందన్నారు. పుత్తడి దిగుమతులపై 2,000 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని, పుత్తడి ధరలు దిగొస్తాయని సెన్కో గోల్డ్ ఈడీ సువంకర్ సేన్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు