అమెరికా ఉత్పత్తులపై  చైనా ప్రతీకార సుంకం 

14 May, 2019 04:46 IST|Sakshi

ఒత్తిడులకు తలొగ్గేది లేదన్న డ్రాగన్‌  

భారీ మూల్యం తప్పదన్న ట్రంప్‌ 

బీజింగ్‌/వాషింగ్టన్‌: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. చైనా ఉత్పత్తులపై సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు చైనా దీటుగా స్పందించింది. తాము కూడా అమెరికా ఉత్పత్తులపై 10 నుంచి 25 శాతం వరకు పన్ను విధిస్తామని పేర్కొంది. ట్రంప్‌ ఒత్తిడులకు తలొగ్గేది లేదంటూ స్పష్టం చేసింది. గత వారం రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ వెంటనే అమెరికా ప్రభుత్వం దాదాపు రూ.14 లక్షల కోట్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్ను శాతాన్ని ప్రస్తుతమున్న 10 నుంచి 25కు పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, మరో రూ.21 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులపైనా ఇలాగే పన్ను భారం మోపుతామని హెచ్చరించింది.

అమెరికా చర్యకు బదులు తీర్చుకునేలా చైనా దాదాపు రూ.4.2 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై 10% మొదలు కొని 25% వరకు పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించింది.  దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌లో స్పం దించారు. ‘మాపై ప్రతీకారం తీర్చుకుంటే చైనా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఆ దేశంతో ఎవరూ వ్యాపారం చేయరు. చాలా కంపెనీలు ఆ దేశం వీడి మరో దేశానికి వెళ్తాయి. మాతో వెంటనే ఒప్పందానికి రావడం మంచిదని జిన్‌పింగ్‌తోపాటు చైనాలోని  మిత్రులకు చెబుతున్నా’ అంటూ పేర్కొన్నారు.   
 

మరిన్ని వార్తలు