వైరస్‌కు చెక్‌!- బ్యాంకింగ్‌ భేష్‌

11 Jul, 2020 09:52 IST|Sakshi

గిలియడ్‌ ఔషధంపై ఆశలు

ఫైనాన్షియల్‌ షేర్ల హైజంప్‌

లాభాలతో ముగిసిన మార్కెట్లు

7 రోజుల్లో నాస్‌డాక్‌ ఆరో రికార్డ్

‌అదే దూకుడు.. టెస్లా ఇంక్ 

ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లు లాభాల దుమ్ము రేపడంతో శుక్రవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లకు బలమొచ్చింది. మరోపక్క ఫార్మా దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ రూపొందిస్తున్న ఔషధం మరింత ప్రభావం చూపుతున్నట్లు వెలువడిన వార్తలు కరోనా వైరస్‌ కట్టడికి సహకరించగలవన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా వారాంతాన డోజోన్స్‌ 369 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 26,075 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 33 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,185 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 70 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 10,617 వద్ద స్థిరపడింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో నాస్‌డాక్‌ ఆరుసార్లు సరికొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం! వెరసి గత వారం డోజోన్స్‌ 1 శాతం, ఎస్‌అండ్‌పీ దాదాపు 2 చొప్పున బలపడగా.. నాస్‌డాక్‌ మరింత అధికంగా 4 శాతం జంప్‌చేసింది. 

1500 డాలర్లకు
గత నెలలో కార్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ జోరు కొనసాగుతోంది. వారాంతాన 7 శాతం జంప్‌చేసి 1503 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి 1500 డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ టెస్లా షేరు 259 శాతం ర్యాలీ చేయగా.. ఈ నెలలోనే 39 శాతం లాభపడటం విశేషం! ఇక వచ్చే వారం క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్న బ్యాంకింగ్‌ దిగ్గజాలు సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, జేపీ మోర్గాన్‌ చేజ్‌ 6.5-5.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ టార్గెట్‌ ధరను పెంచడంతో నెట్‌ఫ్లిక్స్‌ 8 శాతం దూసుకెళ్లింది. దశలవారీగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో క్రూయిజ్‌ల కంపెనీ కార్నివాల్‌ కార్ప్‌ దాదాపు 11 శాతం పురోగమించింది. ఈ బాటలో యునైటెడ్‌, డెల్టా, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు సైతం 5.5 శాతం చొప్పున ఎగశాయి.

ఫార్మా ప్లస్‌
కోవిడ్‌-19 రోగులపై క్లినికల్‌ పరీక్షలలో రెమ్‌డెసివిర్‌ మరింత ప్రభావం చూపుతున్న వార్తలతో గిలియడ్‌ సైన్సెస్ షేరు 2.2 శాతం లాభపడింది. డిసెంబర్‌కల్లా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ సిద్ధంకావచ్చని వెల్లడించిన నేపథ్యంలో బయోఎన్‌టెక్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసింది.

మరిన్ని వార్తలు