మార్కెట్లు వీక్‌- పేపర్‌ షేర్లు గెలాప్‌

29 Jun, 2020 14:38 IST|Sakshi

బ్రైట్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ దన్ను

ఆంధ్రా పేపర్‌- అప్పర్‌ సర్క్యూట్‌

క్యూ4 ఎఫెక్ట్‌- వెస్ట్‌ కోస్ట్ 14% జూమ్‌

శేషసాయి, జేకే, స్టార్‌, ఇమామీ అప్‌

డీమార్ట్‌ స్టోర్ల ప్రమోటర్‌ కంపెనీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఆంధ్రా పేపర్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ కంపెనీలలో వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ ఒకటి కావడం గమనార్హం! వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌
ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా వారాంతాన రాధాకిషన్‌ దమానీ కంపెనీ బ్రైట్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 1.26 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. షేరుకి రూ. 206.23 సగటు ధరలో ఆంధ్రా పేపర్‌లో 5 లక్షల ఈక్విటీ షేర్లను బ్రైట్‌ స్టార్‌ సొంతం చేసుకుంది. నిమి ఎంటర్‌ప్రైజెస్‌ తదితర సంస్థలు వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆంధ్రా పేపర్‌ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 42.5 ఎగసి రూ. 255 సమీపంలో ఫ్రీజయ్యింది. కాగా.. గత వారం ఆంధ్రా పేపర్‌ ప్రమోటర్‌ కంపెనీలలో ఒకటైన ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో 10 శాతం వాటాను విక్రయించింది. 2020 మార్చికల్లా ఆంధ్రా పేపర్‌లో 20 శాతం వాటాను  ఇంటర్నేషనల్‌ పేపర్‌ కలిగి ఉంది.

వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ నికర లాభం 157 శాతం జంప్‌చేసి రూ. 146 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 28 శాతం పెరిగి రూ. 743 కోట్లకు చేరింది. రూ. 48 కోట్లమేర పన్ను లాభం జమకావడం లాభదాయకతకు బలం చేకూర్చింది. గత (2018-19) క్యూ4లో రూ. 42 కోట్ల పన్ను వ్యయాలు నమోదయ్యాయి.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ షేరు 14 శాతం దూసుకెళ్లింది. రూ. 25 ఎగసి రూ. 205 సమీపంలో ట్రేడవుతోంది. 

ఇతర కౌంటర్లూ
పేపర్‌ తయారీ కౌంటర్లలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో స్టార్‌ పేపర్‌ 12 శాతం దూసుకెళ్లి రూ. 118 వద్ద, శేష సాయి 6.3 శాతం జంప్‌చేసి రూ. 166 వద్ద ట్రేడవుతున్నాయి.  ఈ బాటలో ఇమామీ పేపర్‌ దాదాపు 4 శాతం ఎగసి రూ. 84కు చేరగా..  జేకే పేపర్‌ 4 శాతం పెరిగి రూ. 105ను తాకింది. ఇక టీఎన్‌ పేపర్‌ 3.5 శాతం బలపడి రూ. 121 వద్ద, బాలకృష్ణ పేపర్ 5 శాతం పుంజుకుని రూ. 20 వద్ద, బల్లార్‌పూర్‌ 3.7 శాతం లాభంతో రూ. 1.40 వద్ద  వద్ద ట్రేడవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు