పేమెంట్ బ్యాంకులతో...మీకేంటి లాభం?

24 Aug, 2015 01:04 IST|Sakshi
పేమెంట్ బ్యాంకులతో...మీకేంటి లాభం?

గ్రామీణులకూ అందనున్న డిజిటల్ బ్యాంకింగ్
 జీరో బ్యాలెన్స్ ఖాతాలు నిర్వహించుకునే వెసులుబాటు
 నిర్వాహకులైన కార్పొరేట్ల నుంచి రాయితీలొచ్చే అవకాశం
 ప్రభుత్వ బ్యాంకుల కాసా డిపాజిట్లపై మాత్రం ఒత్తిడి!!
 
 పేమెంట్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. చెల్లింపు బ్యాంకులు ఆరంభం కాబోతున్నాయి. కార్పొరేట్లన్నీ బ్యాంకర్ల అవతారం ఎత్తబోతున్నాయి. ఇదీ తాజా ట్రెండ్. సరే! మరి మనకేంటి? బ్యాంకింగ్ కోసమైతే మనకిపుడు బ్యాంకులన్నీ అందుబాటులోనే ఉన్నాయిగా...? మరి ఈ కొత్త బ్యాంకులు రావటం వల్ల మనకు లాభమా? మున్ముందు ఒరిగేదేంటి? జరిగేదేంటి? సామాన్యుల్ని తొలుస్తున్న ఈ ప్రశ్నల విశ్లేషణే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం..
 - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 పేమెంట్ బ్యాంకులు మనకు ఇప్పటిదాకా పరిచయం లేవు. వివిధ రకాల చెల్లింపులకు ఉపయోగపడే ఈ తరహా 11 బ్యాంకులకు ఇటీవలే ఆర్‌బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ అనుమతులు పొందిన వాటిలో పోస్టాఫీసును మినహాయిస్తే మిగి లినవన్నీ భారీ కార్పొరేట్ సంస్థలే. నిజానికి 1990లలో ప్రైవేటు బ్యాంకులకు అనుమతి మం జూరు చేశాక ఇప్పటిదాకా బ్యాంకింగ్‌లో ప్రభుత్వ పరంగా కీలక సంస్కరణలైతే ఏమీ లేవు. కానీ ఇపుడు ఏకంగా 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అనుమతివ్వటంతో పాటు త్వరలో చిన్నస్థాయి బ్యాంకులకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ పేమెంట్ బ్యాంకులతో గ్రామీణులకూ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని కొందరు భావిస్తుండగా... అసలు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పు వస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
 
 రుణాలు తప్ప అన్నీ చేస్తాయి...
 పేరుకు ఇవి చెల్లింపుల బ్యాంకులే. కానీ రుణాలివ్వడం మినహా బ్యాంకులు చేసే అన్నిపనులూ చేస్తాయి. వీటిద్వారా అన్ని బిల్లులూ చెల్లించొచ్చు. ఇవి రూ.లక్ష లోపు విలువైన డిపాజిట్లు స్వీకరించటంతో పాటు డెబిట్/ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లనూ జారీ చేస్తాయి. కాకపోతే ఈ డిపాజిట్లపై సేవింగ్ ఖాతాపై ఎంత వడ్డీ ఇస్తాయో అదే ఇవ్వాలి. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా పేమెంట్ బ్యాంకులు దీన్ని పెంచే అవకాశం ఉంది. కరెంటు, టెలిఫోన్, మున్సిపాల్టీ, క్రెడిట్‌కార్డు వంటి ఇతర బిల్లులతో పాటు, బీమా, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్నీ ఇవి కల్పిస్తాయి.

పూర్తిగా మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఇవి పనిచేస్తాయి. ఇప్పటికే ‘మనీ’ పేరుతో ఎయిర్‌టెల్, ‘ఎం-పెసా’ పేరుతో వొడాఫోన్ మొబైల్ మనీ వ్యాలెట్ సర్వీసులు అందిస్తున్నాయి. కొత్త పేమెంట్ బ్యాంకులూ ఇలాంటివే. కాకపోతే వీటిద్వారా ఇప్పటిదాకా చెల్లింపులు మాత్రమే చేయగలిగేవాళ్లు. ఇప్పుడు ఈ రెండు సంస్థలకు పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ రావడంతో ఏటీఎంలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కార్డుల జారీ, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ వంటివి కూడా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది. ఈ పేమెంట్ బ్యాంకులు ఫారెక్స్, ట్రావెలర్స్, గిఫ్ట్ కార్డులను కూడా జారీ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తుల చెల్లింపులకు ఇవి బాగా ఉపయోగపడతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 బ్యాంకులూ ఇవే చేస్తున్నాయి కదా?
 ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపుల దగ్గర నుంచి నగదు బదిలీ వరకు అన్ని సేవలనూ అందిస్తున్నపుడు ఈ కొత్త పేమెంట్ బ్యాంకుల వల్ల లాభం ఏంటన్నది చాలా మందిలో  మెదిలే ప్రశ్న. ఇది వాస్తవమే అయినా... ఈ లావాదేవీలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆర్‌బీఐ భావిస్తోంది. చాలా వాణిజ్య బ్యాంకుల్లో ఈ సేవలు పొందాలంటే మీ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వ సగటున రూ. 25,000 వరకు ఉంచాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంది.

దీన్ని మెయింటెన్ చేస్తున్న వారికి మా త్రమే బ్యాంకులు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. అదే పేమెంట్ బ్యాం కులు విషయానికొస్తే మినిమమ్ బ్యాలెన్స్ అనేదే ఉండదు. చెల్లింపులకు అవసరమైన నగదును వేసుకొని ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్ ఫోన్ నుంచే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఫోన్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామీణులు ఈ పేమెంట్ బ్యాంక్‌లను ఆదరిస్తారని ఆర్‌బీఐ భావన. ఆఫ్రికాలో కెన్యా వంటి చిన్న దేశంలో వొడాఫోన్ ప్రవేశపెట్టిన ‘ఎం-పెసా’కు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కటి ఆదరణ లభించడమే పేమెంట్ బ్యాంకులకు ప్రేరణగా కనిపిస్తోంది.

 వ్యతిరేకత ఇందుకే...!
 బ్యాంకులు నమోదు చేస్తున్న లాభాల్లో కీలక పాత్ర చౌక వడ్డీరేటున్న కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లదే. చాలామంది ఖాతాదారులు నెలవారీ చెల్లింపుల కోసం సేవింగ్స్ ఖాతాల్లో భారీ మొత్తాన్ని ఉంచుతారు. కానీ ఇప్పుడు పేమెంట్ బ్యాంక్‌లు వస్తే కాసా డిపాజిట్లపై ఒత్తిడి పెరుగుతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అలాగే చాలా బ్యాంకులు, నగదు బదిలీ, బిల్లు చెల్లింపులపై ఫీజుల రూపంలో ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ బ్యాంకులు వస్తే పోటీ పెరిగి ఇటువంటి ఇతర ఆదాయాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
 కొత్త బ్యాంకులివీ..
 రిలయన్స్ ఇండస్ట్రీస్,
 ఆదిత్య బిర్లా నువో,
 వొడాఫోన్ ఎం-పెసా,
 ఎయిర్‌టెల్ ఎం కామర్స్
 చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్,
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్,
 టెక్ మహీంద్రా,
 నేషనల్ సెక్యూరిటీస్
 డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీ ఎల్),
 ఫినో పేటెక్
 సన్ ఫార్మా వ్యవస్థాపకుడు
 దిలీప్ సంఘ్వీ
 పేటీఎం వ్యవస్థాపకుడు
 విజయ్ శేఖర్ శర్మ
 
 ఇవీ ప్రయోజనాలు
 ►గరిష్టంగా లక్ష రూపాయల డిపాజిట్లు స్వీకరించొచ్చు. ఈ డిపాజిట్లపై సేవింగ్స్ ఖాతా వడ్డీరేటును అందిస్తాయి.
 ► సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి పెరిగే అవకాశం ఉంది.
 ► మొబైల్ ఫోన్ ద్వారానే ఇతర ఖాతాలకు నగదు సులభంగా బదిలీ చేసుకోవచ్చు
 ►ఖాతాల్లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు.
 ►ఆఫీసులకు వెళ్లకుండానే ఆటోమేటిక్‌గా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు.
 ►క్రెడిట్ కార్డులు తప్ప ఏటీఎం, డెబిట్, ఫారెక్స్, ట్రావెల్ కార్డులను జారీ చేస్తాయి
 ►ఈ బ్యాంకులన్నీ కార్పొరేట్ల చేతిలోనే ఉన్నాయి కనక వాటి ఉత్పత్తులపై
     రాయితీలిచ్చే అవకాశం

మరిన్ని వార్తలు