కీలక పరిశ్రమల వృద్ధిరేటు 3.2%

3 Nov, 2015 01:36 IST|Sakshi
కీలక పరిశ్రమల వృద్ధిరేటు 3.2%

నాలుగు నెలల గరిష్టం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట.  గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణమయ్యాయి.

ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి (మేలో 4.4 శాతం)  మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాలనూ వార్షికంగా వేర్వేరుగా చూస్తే...
 
వృద్ధిలో...
ఎరువులు: ఈ రంగం వృద్ధి రేటు భారీగా 18.1 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా, 11.6 శాతం క్షీణత (మైనస్)లో ఉంది.
 
విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 10.8 శాతానికి ఎగసింది.
 
రిఫైనరీ ప్రొడక్టులు: ఎరువుల రంగం తరహాలోనే ఈ విభాగం - 2.6 శాతం క్షీణత నుంచి స్వల్పంగా 0.5 శాతం వృద్ధిలోకి మళ్లింది.
 
సహజ వాయువు: ఈ రంగం కూడా -5.8 శాతం క్షీణత నుంచి 0.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది.
 
బొగ్గు: వృద్ధి నమోదుచేసుకుంది. అయితే ఈ రేటు 7.6 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది.
 
క్షీణతలో..
క్రూడ్: -1.1% నుంచి -0.1%కి మెరుగుపడింది.
 
స్టీల్: 6.6% వృద్ధి నుంచి -2.5% క్షీణతకు మళ్లింది.
 
సిమెంట్: 3.7% వృద్ధి నుంచి -1.5% క్షీణించింది.
 
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ..
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.3 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 5.1 శాతం.

>
మరిన్ని వార్తలు