సిక్కుల ఊచకోత మరిచారా? | Sakshi
Sakshi News home page

సిక్కుల ఊచకోత మరిచారా?

Published Tue, Nov 3 2015 1:33 AM

సిక్కుల ఊచకోత మరిచారా? - Sakshi

‘మత అసహనం’పై కాంగ్రెస్‌కు మోదీ చురక
మాకు నీతులు చెప్పే నైతిక హక్కు మీకు లేదంటూ మండిపాటు
బిహార్లో తన ప్రచారం ముగించిన ప్రధాని
దాదాపు 30 సభల్లో ప్రసంగం
 
 పూర్నియా: మరో రెండు రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలపై విమర్శల పదును పెంచారు. తరచుగా మత అసహనం అంశాన్ని లేవనెత్తుతున్న కాంగ్రెస్‌కు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తుచేశారు. ‘సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి మాకు నీతులు చెప్తారా?’ అంటూ విరుచుకుపడ్డారు. మోదీ సోమవారం సీమాంచల్ ప్రాంతంలోని పూర్నియాలో, దర్భంగాలో, ఫోర్బిస్‌గంజ్‌లో జరిగిన సభల్లో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ‘మీకు 1984 నాటి దురాగతం గుర్తుందా? ఇందిర హత్యానంతరం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో లక్షలాది సిక్కులను ఊచకోత కోశారు. నాటి అల్లర్ల బాధితుల కన్నీళ్లింకా ఇంకిపోలేదు. వారి గాయాలింకా మానలేదు.

ఈ దురాగతానికి సంబంధించి కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ మత సహనంపై మాకు పాఠాలు చెబ్తోంది. డ్రామాలు ఆడుతోంది. సిగ్గుతో తల దించుకోవాల్సిన వారు మాకు నీతులు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు. అసహనంపై తమకు పాఠాలు చెప్పే నైతిక హక్కు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి లేదన్నారు. దేశంలో పెచ్చరిల్లుతున్న మత అసహన ఘటనలకు నిరసనగా కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకోవడం, విభజనవాద శక్తులు దేశ ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామని ఆదివారం సోనియా విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్లో ఎన్డీయే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ.. సుడిగాలి పర్యటనల్తో ప్రచారం సాగించారు. దాదాపు 30 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.

 జంగిల్ రాజ్ + జంతర్‌మంతర్ రాజ్
 ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్‌ల పొత్తును ‘జంగిల్ రాజ్ + జంతర్‌మంతర్ రాజ్’ అని మోదీ అభివర్ణించారు. వారిద్దరూ కలసి బిహార్‌ను నాశనం చేస్తారంని హెచ్చరించారు. వారు తోసేసిన వెనకబాటుతనం అనే బావి నుంచి బిహార్‌ను పైకి లాగేందుకు రెండు ఇంజిన్లు అవసరమని, వాటిలో ఒకటి ఢిల్లీలో(కేంద్రంలోని ఎన్డీయే) ఉందని, మరోటి పట్నాలో రావాలని వ్యాఖ్యానించారు.

 థాంక్యూ నితీశ్, లాలూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 స్థానాలు కేటాయించినందుకు మహా కూటమి నేతలు నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు మోదీ వ్యంగ్య రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆ 40 సీట్లు ఈజీగా బీజేపీ ఖాతాలో చేరుతాయి’ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ ఉనికే లేదంటూ వ్యాఖ్యానించారు.

 ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు ఆశ్రయం ఇస్తూ దేశ భద్రతపై ఆటలాడుతున్నాయంటూ మహా కూటమి నేతలపై మోదీ ధ్వజమెత్తారు. ముస్లింలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల నుంచి 5% కోత పెట్టాలని కుట్ర చేస్తున్నాయని జేడీయూ, ఆర్జేడీలపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. ‘కులతత్వ విషం, మతతత్వ పిచ్చి.. ఇవి ప్రజాస్వామ్యంపై మరకల’న్నారు.

 ప్రతిపక్ష నేత ఎవరు?
 బిహార్లో ఎన్డీయే గెలుపు ఖాయమనే అర్థంలో.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి మధ్య పోటీ ఉంటుందని ఎద్దేవా చేశారు. నితీశ్, లాలూ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కలిసి ఒక్క ఎన్నికల సభలోనూ పాల్గొనకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. వారి మధ్య నెలకొన్న విశ్వాసలేమికి అదే తార్కాణమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement