ఫ్లోటర్ హెల్త్ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి?

29 Feb, 2016 00:25 IST|Sakshi
ఫ్లోటర్ హెల్త్ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి?

ఫైనాన్షియల్ బేసిక్స్..
సాధారణంగా మనపై ఆధారపడ్డ వారి బాగోగులు చూసుకోవడానికి బీమా పాలసీలు తీసుకుంటాం. వీటిల్లో హెల్త్ పాలసీలు కూడా ఉంటాయి. మన కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం వచ్చినపుడు, దానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు, ఇతర ఎమర్జెన్సీ పరిస్థితులలో ఆరోగ్య బీమా పాలసీలు దన్నుగా నిలుస్తాయి. ప్రస్తుతం బీమా కంపెనీలు పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. వాటిల్లో ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి.

ఇది సాధారణ ఆరోగ్య బీమా పాలసీ మాదిరే ఉంటుంది. కానీ వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా.. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో కవరేజ్ ఒకరికి మాత్రమే ఉంటుంది. ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో మొత్తం కుటుంబ సభ్యులకు కవరేజ్ ఉంటుంది. ఇందులో ప్రీమియం కుటుంబ పెద్ద వయసు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా కుటుంబాన్ని ప్రారంభించిన వారు ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వారి కుటుంబం పెరుగుతూ వస్తుంది కాబట్టి. ఈ పాలసీకి పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.

పాలసీ ఎంపికకు ముందు మీ అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోండి. అలాగే బీమా కంపెనీ పనితీరు, క్లెయిమ్ సెటిల్‌మెంట్, దాని సేవలు, పాలసీ వివరాలు వంటి తదితర అంశాలపై కూడా కన్నేయండి. పాలసీ తీసుకునే ముందు మీ ఆరోగ్యం, అలవాట్ల సమాచారాన్ని కంపెనీ ముందు దాచొద్దు. ఇక కుటుంబంలో ఎవరికైనా ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే వారి కోసం విడిగా ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు