నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసిన ద్రవ్యోల్బణం

16 Jul, 2018 15:13 IST|Sakshi
నాలుగున్నరేళ్ల గరిష్టానికి హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశీయ హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసింది. కొన్ని ఆహారోత్పత్తులు, ఆయిల్‌ ధరలు పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) జూన్‌ నెలలో 5.77 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. మే నెలలో డబ్ల్యూపీఐ 4.43 శాతంగానే ఉండేది. 2017 జూన్‌లో అయితే కేవలం 0.90 శాతం మాత్రమే. మొత్తం టోకు ధరల సూచీల్లో ఐదో వంతు కంటే ఎక్కువ కలిగి ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్‌ జూన్‌ నెలలో 5.3 శాతం పెరిగాయి. మే నెలలో ఇవి 3.16 శాతంగా మాత్రమే ఉన్నాయి.

కూరగాయల ధరలు కూడా జూన్‌ నెలలో 8.12 శాతానికి పెరుగగా.. బంగాళదుంప ధరలు జూన్‌లో 99.02 శాతానికి ఎగిశాయి. పప్పు ధాన్యాలు ధరలు మాత్రం రివర్స్‌ ట్రెండ్‌లో తగ్గుతూ వస్తున్నాయి. మే నెలలో -21.13 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ధరలు, జూన్‌ నెలలో -20.23 శాతంగా నమోదయ్యాయి. ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం ఈ డబ్ల్యూపీఐలో 13.15 శాతం వెయిటేజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం మాత్రం మే నెలలో 11.22 శాతంగా ఉంటే, జూన్‌ నెలలో ఏకంగా 16.18 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు 13.90 శాతం నుంచి 17.45 శాతానికి, డీజిల్‌ ధరలు 17.34 శాతం నుంచి 21.63 శాతానికి ఎగిశాయి. గత వారం విడుదలైన జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా 5 శాతం ఎగిసింది. ఇది నాలుగు నెలల గరిష్టం. 

మరిన్ని వార్తలు