LPG Prices Hike: మళ్లీ పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..

1 Nov, 2023 10:50 IST|Sakshi

భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి.

ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్‌ లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు.

అయితే ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది.

ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి.

మరిన్ని వార్తలు