‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్‌ హెచ్చరిక!

12 Oct, 2023 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్‌ హెచ్చరించింది.  అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్‌ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది.

ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్‌షిప్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎనర్జీ  14వ ఎడిషన్‌– ఎన్‌రిచ్‌ 2023 కార్యక్రమంలో  చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌–హమాస్‌ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్‌’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్‌– పాలస్తీనా ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ హమాస్‌ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.  

  • ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. 
  • గ్లోబల్‌ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్‌ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను.  
  • పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి.  
  • భారత్‌ ఇంధన డిమాండ్‌ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్‌ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది.  
  • ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్‌  చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్‌పీజీ వినియోగదారు.  నాల్గవ అతిపెద్ద ఎన్‌ఎన్‌జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్‌. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌ కలిగి ఉన్న దేశం.  
  • రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌ వృద్ధిలో భారత్‌ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 

2050 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌! 
భారత్‌ 2050 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు.

అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్‌ 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని  కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. 

మరిన్ని వార్తలు