షాకింగ్‌ న్యూస్‌; షావోమి వివరణ

2 May, 2020 20:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి సేకరిస్తున్నట్టు వస్తున్న వార్తలను షావోమి ఇండియా తోసిపుచ్చింది. డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. షావోమి ఇండియా మొత్తం డేటాను రెండేళ్ల క్రితం స్థానిక సర్వర్‌లకు తరలించినట్టు వెల్లడించింది. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా డేటాను తాము సేకరించడం లేదని షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. తమ దగ్గరున్న సమాచారాన్ని సురక్షితంగా ఉంటుందని, బయటకు వెల్లడించే అవకాశం లేదన్నారు. ఇండియా డేటా ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. షావోమి తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్‌ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు మనుకుమార్‌ జైన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. (మొబైల్‌ డేటాతో ‘కరోనా’ గుర్తింపు!)

‘ఇంటర్నెట్ సంస్థగా షావోమి వినియోగదారుల సమాచార రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. డేటా గోప్యతలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ బ్రౌజర్‌ల మాదిరిగానే ఎంఐ బ్రౌజర్  ప్రోటోకాల్‌లను అనుసరిస్తుంది. ఇది వినియోగదారుల నుంచి స్పష్టమైన అనుమతి లేదా సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించదు. మా దగ్గరున్న సమాచారాన్ని పూర్తి సురక్షితంగా ఉంటుంది. రహస్య మోడ్‌లో బ్రౌజ్ చేసిన వాటిని ఎంఐ బ్రౌజర్‌ ఎప్పటికీ గుర్తించలేదు. లాగిన్ అయిన వినియోగ డేటా మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఏదైనా వెబ్‌సైట్ పని చేయకపోతే లేదా నెమ్మదిగా ఉంటే మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగ్గా, వేగంగా చేయడానికి రహస్య డేటా ఉపయోగించబడుతుంది. ఇది ఇతర బ్రౌజర్ చేసే మాదిరిగానే ఉంటుంది. ఎంఐ బ్రౌజర్‌తో సహా షావోమి స్మార్ట్‌ఫోన్లు, వాటిలోని డీఫాల్ట్‌ యాప్‌లు.. భద్రత, గోప్యతపరంగా సురక్షితమైనవని ప్రఖ్యాత అంతర్జాతీయ థర్డ్‌ పార్టీ కంపెనీలు ట్రస్ట్ఆర్క్, బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూషన్ (బిఎస్ఐ) ధ్రువీకరించాయి. ఎంఐ బ్రౌజర్‌, ఎంఐ క్లౌడ్‌లోని భారత వినియోగదారుల డేటా అంతా ఇండియాలోని ఏఎస్‌డబ్ల్యూ సర్వర్లలో స్థానికంగా నిల్వ చేయబడుతుంద’ని మనుకుమార్‌ జైన్‌ వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా