Apple Sales In China: టెక్‌ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్‌!

13 Nov, 2023 10:14 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్‌ తగిలింది. చైనాలో యాపిల్‌ అమ్మకాలు తగ్గగా.. స్థానిక కంపెనీ షావోమీకి మాత్రం కొనుగోలు దారులు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రస్తుతం వరకు మొత్తం 20 బిలియన్‌ డాలర్లకు మార్కెట్‌ విలువ పెరిగింది. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌తో పాటు ఇతర రంగాల్లోని వ్యాపారాలు గణనీయమైన వృద్దిని సాధించాయి. ఫలితంగా హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో షావోమీ స్టాక్‌ విలువ 60 శాతం పెరిగినట్లు హాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ తెలిపింది. 

ఇటీవల యాపిల్‌ క్యూ4 ఫలితాలు విడుదల చేసింది. ఆ ఫలితాల్లో కంపెనీకి రెవెన్యూ తగ్గినా.. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ 15 సిరీస్ కొనుగోళ్లు భారీగా జరిగినట్లు నివేదించింది. జులై నుంచి సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి ఈ లేటెస్ట్‌ సిరీస్‌ ఫోన్‌ల 73.5 బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 1శాతం తగ్గింది.    

అయితే ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో యాపిల్‌ సేల్స్‌ తగ్గినా.. రానున్న రోజుల్లో ఆ సంస్థకు ఆశించిన స్థాయిలో మార్కెట్‌ ఫలితాలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా చైనాలో ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల తయారీ సంస్థలు సైతం అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాయి. 

షోవోమీ 14 సిరీస్‌ అమ్మకాల జోరు 
చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ గత నెల 26న ‘షావోమీ 14’ సిరీస్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల ఫోన్‌లు అమ్ముడు పోయాయి. చైనా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఈ అమ్మకాల్ని షావోమీ రెండో సారి సాధించింది.  షావోమీ తర్వాతి స్థానంలో హువావే టెక్నాలజీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ మేట్‌ 60 ప్రొ ఉంది. కాగా, షావోమీ ఫోన్‌లే కాకుండా ఎలక్ట్రిక్‌ వెహికల్‌, ఏఐ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌ అదే స్థాయిలో ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చైనా కంపెనీల ఫోన్‌ల జోరు
డ్రాగన్‌ దేశం ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతుంది. కాబట్టే అక్కడి పౌరులు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తున్నారు. వారి నిర్ణయం స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోళ్లపై పడింది. ఇటీవల ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ నివేదికలో క్యూ3లో స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ 3 శాతం పడిపోయాయి. దీనిపై అమెరికా పెట్టుబడి సంస్థలు మోర్గాన్‌ స్టాన్‌లీ, సిటీ గ్రూప్‌లు స్పందిస్తూ.. వచ్చే ఏడాది నాటికి చైనాలో స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.   

చదవండి👉 ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్‌.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్..

మరిన్ని వార్తలు