సంతోషి కుటుంబానికి బెదిరింపులు

22 Oct, 2017 14:31 IST|Sakshi

రాంచీ : జార్ఖండ్ లో ఈ మధ్యే 11 ఏళ్ల చిన్నారి సంతోష్‌ కుమారి ఆధార్‌ అనుసంధానం మూలంగా ప్రాణాలు కోల్పోయిందన్న విమర్శలు తెలెత్తటం తెలిసిందే. నిరక్షరాస్యులైన పేద ప్రజల ఆకలి చావుకు దర్పణం పట్టిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే అది ఆధార్‌ మరణం కాదంటూ యూఐడీఏ చెప్పటం.. మలేరియాతో చిన్నారి చనిపోయిందంటూ ఆరోగ్య శాఖ ప్రకటించటంతో... జార్ఖండ్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ కుటుంబం ఉంటున్న సిమ్‌డేగలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత బాలిక కుటుంబాన్ని చంపుతామంటూ గ్రామస్తులు బెదిరించారని సమాచారం. ఈ మేరకు సంతోషి కుమారి తల్లి కొయిలా దేవి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘మా కుటుంబం భయంతో బతుకుతున్నాం. వెంటనే ఊరు వదిలి వెళ్లాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు’’ అని కోయిలా దేవి ఆరోపించారు.  

దీంతో ఆదివారం పెద్ద ఎత్తున్న పోలీస్‌ బలగాలు గ్రామంలో మోహరించి పహరా కాస్తున్నాయి. మరోవైపు ఆమెపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జార్ఖండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి సరయు రాయ్ ప్రకటించారు. ఆమెకు ఇకపై ఎలాంటి సమస్య తలెత్తబోదని ఆయన హామీ ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు