ఆ ఎమ్మెల్యే నన్ను రేప్‌ చేశాడు!

7 Mar, 2019 12:37 IST|Sakshi
అభియోగాలు ఎదుర్కొంటున్న ఆప్‌ ఎమ్మెల్యే మోహిందర్‌ గోయల్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన రిథాల ఎమ్మెల్యే మోహిందర్‌ గోయల్‌ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆప్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రశాంత్‌ విహార్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

తన భర్త ద్వారా మోహిందర్‌ గోయల్‌ తనకు తెలుసు అని బాధితురాలు (40) ఫిర్యాదులో తెలిపారు. ‘2008లో నా భర్త చనిపోయాడు. గత ఏడాది డిసెంబర్‌లో పెన్షన్‌ విషయమై ఎమ్మెల్యేను కలిశాను.  దీంతో ఇంటికి రావాల్సిందిగా ఆయన సూచించాడు. ఇంటికి వెళ్లిన నాపై ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడు’ అని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత నెలరోజులకు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన తనపై మోహిందర్‌ మరోసారి అత్యాచారం జరిపాడని, దీంతో తాను అప్పట్లో స్థానిక పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు.

అయితే, జరిగిన తప్పునకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాడని, దీంతో విషయాన్ని క్లిష్టతరం చేయడం ఇష్టంలేక తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కానీ గత నెలలో ఎమ్మెల్యే సోదరుడు తనను బెదిరిస్తూ.. తనకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌కు పంపాడని, ఎమ్మెల్యే అఘాయిత్యం గురించి బయటకు చెబితే.. వాటిని సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేస్తానని హెచ్చరించాడని, దీంతో పోలీసులను ఆశ్రయించి.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు ఆమె తెలిపారు. అయితే, ఆ మహిళ తనకు తెలుసునని, ఆమె ఎందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందో తెలియడం లేదని ఎమ్మెల్యే మోహిందర్‌ గోయల్‌ తెలిపారు. మరోవైపు మెజిస్ట్రేట్‌ ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి.. నిందితుడిపై 376 (అత్యాచారం), 506 (బెదిరింపులు), 509 (మహిళ మర్యాదకు భంగం కలిగించడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రోహిణీ జిల్లా డీఎస్పీ ఎస్డీ మిశ్రా తెలిపారు.
 

మరిన్ని వార్తలు