లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్‌ అసిస్టెంట్‌

23 Aug, 2019 11:09 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, పట్టుబడిన సీనియర్‌ అసిస్టెంట్‌ చిక్కాల సాయిబాబా, పక్కన నగదు

సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ రామచంద్రరావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామానికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ గాది వరప్రసాద్‌ 2016లో రూ.9.5 లక్షల వ్యయంతో అన్నవరం రైల్వేస్టేషన్‌కు ఎదురుగా గల దేవస్థానం పొలంలో రేకుల షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను టెండర్‌ ద్వారా పొందాడు. పని పూర్తయ్యాక అతడికి కాంట్రాక్ట్‌ తాలుకు బిల్లులు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఈఎండీ మొత్తం రూ.40,646 దేవస్థానం వద్ద డిపాజిట్‌లో ఉంచారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్‌ పూర్తయిన రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్‌ గాది వరప్రసాద్‌ నాలుగు నెలలుగా ఈఎండీ మొత్తాన్ని ఇవ్వమని ఇంజినీరింగ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 19న ఇదే పనిపై ఇంజినీరింగ్‌ విభాగంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ చిక్కాల సాయిబాబాను కలిశాడు.

రూ.ఐదు వేలు ఇస్తే తప్ప డిపాజిట్‌ రిఫండ్‌ ఇవ్వడం కుదరదని సాయిబాబా చెప్పడంతో కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగినట్టుగా సాయిబాబా వాయిస్‌ రికార్డు కూడా కాంట్రాక్టర్‌ సమర్పించడంతో దానిని పరిశీలించి సాయిబాబాపై నిఘా ఉంచామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్‌ వరప్రసాద్‌ సాయిబాబాకు కెమికల్‌ పూసిన రూ.500 నోట్లు ఇవ్వగా, తాము దాడి చేసి పట్టుకున్నామన్నారు. లంచం స్వీకరించిన నిందితుడు సాయిబాబాను అరెస్ట్‌ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్‌ చేస్తే సెల్‌:9440446160కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు తిలక్, మోహన్‌రావు, పుల్లారావు, ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు ఈ దాడి లో పాల్గొన్నారు.


విసిగి ఫిర్యాదు చేశా: కాంట్రాక్టర్‌ గాదె వరప్రసాద్‌
నిరుద్యోగంతో వేగలేక చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న  తనను అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులు ఈఎండీ ఇవ్వకుండా వేధించారని కాంట్రాక్టర్‌ గాదె వరప్రసాద్‌ విలేకర్లకు తెలిపారు. తాను ఈఎండీ సొమ్ము ఇవ్వమని ఇంజినీరింగ్‌ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు గుమస్తా కూడా ఈఎండీ ఇవ్వాలంటే కొంచం ఖర్చువుద్ది అని చెప్పాడని తెలిపారు. దాంతో మూడు నెలలు ఆగి మరలా వస్తే ఇప్పుడున్న గుమస్తా చిక్కాల సాయిబాబా కూడా రూ.ఐదు వేలు  లంచం ఇవ్వనిదే పని జరగదని చెప్పాడని తెలిపారు.

దాంతో ఏసీబీ ని ఆశ్రయించినట్టు తెలిపారు. దేవస్థానంలో కాంట్రాక్ట్‌ చేసినట్టుగా  ‘ఎక్స్‌పీరియన్స్‌’ సర్టిఫికెట్‌ ఇవ్వమని 2018లో ఇంజినీరింగ్‌ అధికారులను, అప్పటి ఈఓను అడిగినా ఇవ్వలేదని తెలిపారు. అదే విధంగా ఇంజినీరింగ్‌ కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన తన మోటార్‌ సైకిల్‌ చోరీ జరిగిందని దీనిపై దేవస్థానం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కాంట్రాక్టర్‌ వరప్రసాద్‌ వాపోయారు. దీంతో విసిగి వేసారి సిబ్బందిలో కొంతైనా మార్పు వస్తుందనే ఇలా చేశానని తెలిపారు.

మరిన్ని వార్తలు