సీఐ వచ్చే వరకు రక్తం తుడవలేదు 

16 Mar, 2019 03:59 IST|Sakshi

ముందు గుండెపోటుతో రక్తవాంతులు అయ్యుంటాయని భావించారు  

పోలీసుల సమక్షంలో ఆస్పత్రికి తరలించే సమయంలో గాయాల గుర్తింపు 

కేసును తప్పుదారి పట్టించేందుకు సీఎం కొత్త పన్నాగం 

సాక్షి ప్రతినిధి కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు మరో కొత్త పన్నాగానికి తెరతీసినట్లు అర్థమవుతోంది. రక్తాన్ని ఎందుకు తుడిచేశారంటూ కొత్త పల్లవి అందుకుని కేసును గందరగోళంలోకి నెట్టేసేందుకు సర్వశక్తులా శ్రమిస్తున్నట్లు అవగతమవుతోంది. అసలు జరిగిందేంటంటే.. వివేకా మృతి చెందారన్న విషయాన్ని ధృవీకరించుకున్న పీఏ కృష్ణారెడ్డి ముందుగా కుటుంబసభ్యులకు అక్కడి పరిస్థితిని వివరించారు. తర్వాత మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నిర్జీవంగా పడి ఉన్న పెదనాన్నను చూసి నిర్ఘాంతపోయారు. శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అప్పట్లో గాయాలు సైతం కన్పించని పరిస్థితి. గుండెపోటు సందర్భంగా రక్తపు వాంతుల కారణంగా అలా అయిపోయారని భావించారు.

వైఎస్‌ వివేకా చాలా సౌమ్యుడు, ఎవరికీ అన్యాయం తలపెట్టని వ్యక్తి. దీంతో ఆయన  హత్యకు గురై ఉంటారని కుటుంబసభ్యులు ఊహించలేదు. కాగా వివేకా హత్యానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రక్త నమూనాలు ఎందుకు చెరిపేశారంటూ పదేపదే ప్రసంగించారు. వాస్తవంగా సీఐ శంకరయ్య వచ్చేవరకు ఎవరూ రక్త నమూనాలు చెరపలేదు. కుటుంబసభ్యులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సీఐ సమక్షంలో అంబులెన్సు తెప్పించి ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ముఖంపై రక్తం తుడవగా గాయాలు కన్పించాయి. ఇప్పటికీ బాత్‌రూంలో రక్త నమూనాలు అలాగే ఉన్నాయి. బాత్‌రూంకు పోలీసులే తాళం వేసుకుని వెళ్లారు. కానీ ఘటన తీవ్రతను దెబ్బతీసేలా సీఎం ఎత్తుగడలు పన్నారని పలువురు వివరిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా