‘రేటింగ్‌’ పేరుతో చీటింగ్‌

15 Nov, 2023 04:41 IST|Sakshi

గూగుల్‌ మ్యాప్‌ రేటింగ్‌ పేరిట సైబర్‌ మోసాలు 

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారని, గూగుల్‌ మ్యాప్‌లోని ప్రాంతాలకు రేటింగ్‌ ఇవ్వాలంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరించారు. ఇందుకోసం ఏకంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఐటీ) నుంచి పంపుతున్నట్టుగా నకిలీ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.

వారు పంపే లింక్‌లపై క్లిక్‌ చేసి అందులో వచ్చే గూగుల్‌ మ్యాప్‌లో వారు చెప్పిన ప్రాంతానికి రేటింగ్‌ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒక్కో రేటింగ్‌కు రూ.150 ఇస్తామని, ఇలా రోజుకు కనీసం రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఊదరగొడుతున్నారు. ఎవరైనా ఇది నిజమని నమ్మితే ఒకటి, రెండుసార్లు డబ్బులు పంపి..ఎదుటి వ్యక్తికి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నా రు.

బ్యాంకు ఖాతాల వివరాలు..ఆధార్, పాన్‌కార్డు వివరాలు సేకరించడం..లింక్‌లో ఓటీపీ నమోదు చేయాలని చెబుతూ ఆన్‌లైన్‌లో డబ్బులు కొల్లగొడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో కొన్ని నెలల క్రితం సోమాజిగూడకు చెందిన ఒక యువకుడు గూగుల్‌ మ్యాపింగ్‌ రేటింగ్‌ స్కాంలో చిక్కి రూ.74 వేలు పోగొట్టుకున్నాడని తెలిపారు.  

మరిన్ని వార్తలు